దావూద్ లొంగిపోతానన్నాడు..
కొన్ని షరతులు పెట్టాడు.. పవార్ పట్టించుకోలేదు: జెఠ్మలానీ
ముంబై: చీకటి సామ్రాజ్యాధినేత దావూద్ ఇబ్రహీం.. 1990ల్లో భారత అధికారులకు లొంగిపోతానని ముందుకు వచ్చాడని.. కానీ నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్‌పవార్ ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ఆరోపించారు. ‘‘దావూద్.. తాను వెనక్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే.. తనపై థర్డ్ డిగ్రీ (హింసాత్మక విచారణ) ప్రయోగించబోమని, తనను గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్)లో ఉంచుతామని ప్రభుత్వం నుంచి హామీ కావాలన్నాడు. తను తప్పు చేసినట్లయితే శిక్ష ఎదుర్కోవటానికి సిద్ధమనీ చెప్పాడు’’ అని జెఠ్మలానీ శనివారం ఏఎన్‌ఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు.
తాము లండన్‌లో కలిసినపుడు దావూద్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ‘‘అతడు ఈ విషయం చెప్పినపుడు.. నేను దీనిని రాతపూర్వకంగా శరద్‌పవార్‌కు పంపించాను. ఈ ప్రతిపాదన గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా నా కుమారుడికి చెప్పాను’’ అని తెలిపారు. ఈ విషయంలో ముందుకు వెళ్లరాదని నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చని పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ‘‘అది శరద్‌పవారా? లేక కాంగ్రెస్సా? అనేది మాకు తెలీదు. కానీ.. ఈ నిర్ణయాన్ని శరద్‌పవార్ ఒక్కరే తీసుకోగలిగి ఉండకపోవచ్చు. కేంద్రం అభిప్రాయం ఇందులో ఉండి ఉండాలి’’ అని వ్యాఖ్యానించారు.
షరతులు ఆమోదనీయం కాదని తిరస్కరించాం: పవార్
రాంజెఠ్మలానీ వెల్లడించిన అంశంపై ఎన్‌సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్‌పవార్ స్పందిస్తూ.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాడని, తనను సంప్రదించటం నిజమేనని.. అయితే అందుకు పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదనీయం కాదని.. దాంతో ఆ ప్రతిపాదనను తిరస్కరించటం జరిగిందని చెప్పారు. ‘‘దావూద్‌ను జైలులో పెట్టరాదని, అతడిని ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని షరతు పెట్టారు. అది ఆమోదనీయం కాదు. అతడు చట్టం ముందు నిలవాల్సి ఉంటుందని మేం చెప్పాం’’ అని పవార్ శనివారం ముంబైలో విలేకరులకు వివరించారు. 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం కీలక నిందితుడన్న విషయం తెలిసిందే.