జూలైలో గృహనిర్మాణ పథకం
న్యూఢిల్లీ: నగరవాసులకు శుభవార్త. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) వచ్చే నెలలో భారీ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనుంది. మొత్తం 26 వేల ఫ్లాట్ల నిర్మాణం చేపట్టింది. ఈ విషయాన్ని డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక పడక గది ఉండే 24 వేల ఫ్లాట్లతోపాటు మరో రెండు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నామన్నారు. ఈ పథకం జూలైలో అందుబాటులోకి వస్తుందన్నారు. డీడీఏ, 2014లో భాగంగా దీనిని చేపట్టామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తున్నామన్నారు. వీటి ధరలు రూ. 14 లక్షల నుంచి మొదలుకుని రూ. కోటిదాకా ఉంటాయన్నారు.
కాగా ఈ పథకం నాలుగు ఏళ్ల విరామం తరువాత ప్రారంభమవనుంది. 2010లో డీడీఏ 16 వేల ఫ్లాట్లను నిర్మించిన సంగతి విదితమే. తాజా పథకంలో భాగంగా 24 వేల ఫ్లాట్లను చవక ధరలకు విక్రయించనుంది. మిగతా ఫ్లాట్లను ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీలుగా విభజించింది. సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్లను ఆర్థికంగా వెనుకబడినవారికి కేటాయించాలా లేక మరెవరికి కేటాయించాలనే విషయమై త ్వరలో సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని బల్వీందర్‌కుమార్ తెలిపారు. ఈ ఫ్లాట్లలో అత్యధిక శాతం ప్రీ-ఫ్యాబ్రికేటెడ్‌గా నిర్మించామన్నారు. ఇవి హరిత లక్షణాలను కలిగి ఉంటాయన్నారు. 2021, ఢిల్లీ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించామన్నారు. ద్వారకా, నరేలా, రోహిణి ప్రాంతాల్లో నాలుగు అంతస్తులు లేదా ఆపైన నిర్మించామన్నారు. జూలై చివరినాటికల్లా 15 వేల ఫ్లాట్లను సిద్ధం చేస్తామన్నారు. మిగతా వాటి నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తవుతుందన్నారు. ఆ తర్వాత ఆయా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.