బరువైన 'బుల్లెట్' ప్రాణం తీసింది
Published Thu, Jan 14 2016 4:27 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది . ఒకవైపు అతి వేగం, మరోవైపు బరువైన వాహనం మానిక్ గౌర్(32) ప్రాణాలు తీసింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని శంకర్ విహార్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రత్యక్ష సాక్షులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
క్రేజీ బైక్ బుల్లెట్ పై రైడ్ అంటే యువకులకు మహా ఉత్సాహం. ఈ ఉత్సాహంలోనే మానిక్ మితిమీరిన వేగంతో బుల్లెట్ పై వెడుతూ పక్కనే ఉన్న టెంపోను ఢీకొట్టాడు. అక్కడితో అది ఆగలేదు.. కొన్నిమీటర్ల దూరం వాహనాన్ని ఈడ్చుకెళ్లి పోవడంతో మంటలు చెలరేగాయి. బండి పూర్తిగా అదుపు తప్పి, అతను కిండపడిపోయాడు. అతనిపై బుల్లెట్ పడిపోయింది. పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మానిక్ మంటల్లో చిక్కుకు పోయాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు అతణ్ని ఆసుపత్రి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.
అయితే బుల్లెట్ బరువు ఎక్కువగా ఉండడంతో అతను తప్పించుకోలేకపోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. సుమారు 200 కిలోల వెయిట్ వున్న వాహనాన్ని లేపలేకపోయాడని , మంటలు బాగా వ్యాపించడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు.
Advertisement
Advertisement