
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులు, ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఢిల్లీ వాసులకే కేటాయిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన క్రమంలో ఆయన నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తిరగతోడారు. ఢిల్లీలో ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా చికిత్స అందచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్ధానికేతరుడు పేరుతో ఏ ఒక్క రోగికీ ట్రీట్‌మెంట్‌ను నిరాకరించరాదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కులో ఆరోగ్యంగా జీవించే హక్కు అంతర్భాగమని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొందని లెఫ్టినెంట్ గవర్నర్ తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
స్ధానికులు, స్ధానికేతరులు అనే ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంల్లో చికిత్స అందించాలని పేర్కొన్నారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం 10,000 పడకలను స్ధానికులకు కేటాయించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బెడ్స్‌ను అందరూ వాడుకోవచ్చని, కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న ప్రత్యేక చికిత్స కూడా అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. స్ధానికేతరులకు చికిత్స అందించబోమని కేజ్రీవాల్ చేసిన ప్రకటనను బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తీవ్రంగా తప్పుపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment