జంతర్‌మంతర్ వద్ద శాంతి ర్యాలీ
న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు గాడిన పడుతున్నాయి. శనివారం ప్రజలు బయటకు వచ్చి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. నిత్యావసరాలు సమకూర్చుకోవడంతోపాటు, దెబ్బతిన్న ఆస్తులను, మంటల్లో దహనమైన ఇళ్ల శిథిలాలను తొలగించి, చక్కదిద్దుకోవడం ప్రారంభించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించేందుకు బలగాల కవాతు చేస్తున్నారు. అల్ల్లర్లను నిరసిస్తూ ‘ఢిల్లీ పీస్ ఫోరం’ అనే ఎన్జీవో జంతర్‌మంతర్ వద్ద శాంతి ర్యాలీ చేపట్టింది. జాతీయ జెండాను చేతబూనిన వందలాది మంది ప్రదర్శనకారులు జై శ్రీరాం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
నిరసన తెలిపితే కేసులా?: కాంగ్రెస్
ఢిల్లీ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని, దీనిపై నిగ్గు తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించాలని సుప్రీంకోర్టును కాంగ్రెస్ కోరింది. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ శనివారం వ్యాఖ్యానించారు. ‘విద్వేష పూరిత ప్రసంగం అర్థం ఏంటి? బీజేపీ నేతల ప్రసంగాలు విద్వేషపూరితం కాదు. అదే ఆందోళనకారులు మాట్లాడితే సంఘ విద్రోహం కేసులు పెడుతున్నారు’ అని తెలిపారు.
రెచ్చగొట్టడంలో వారికి ప్రావీణ్యం: నక్వి
ప్రతిపక్షాలు ఢిల్లీ అల్లర్ల బాధితుల గాయాలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి శనివారం ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలకు ప్రజలను రెచ్చగొట్టడంలో మంచి నైపుణ్యం ఉందని మీడియాతో వ్యాఖ్యానించారు.
ఫిర్యాదుల కోసం...
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో మెసేజీలను ఫార్వర్డ్ చేసి, ప్రచారం కల్పించడం నేరమని ఢిల్లీ ప్రభుత్వం శనివారం పేర్కొంది. వీటిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం యోచి స్తోంది. ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలలను మార్చి 7వ తేదీ వరకు తెరవరాదని ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment