హై స్పీడ్ 'టాల్గో' చివరి ట్రయల్ రన్!
న్యూఢిల్లీః హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల సాకారమయ్యే ఘడియలు దగ్గరపడ్డాయి. ఢిల్లీనుంచి ముంబైకి కేవలం 12 గంటల్లో చేరుకోగలిగే టాల్గో ట్రైన్ సోమవారం చివరి ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైన ఈ ట్రయల్ రన్ ఆగస్ట్ 5 వరకూ కొనసాగనుంది. ఇందులో భాగంగా మొదటి ట్రయల్ రన్ ఆగస్టు 1న, రెండవరన్ ఆగస్టు 3న, మూడవ రన్ ఆగస్టు 5న నిర్వహించనున్నారు.
బుల్లెట్ లా దూసుకుపోయే హైస్సీడ్ రైలు దేశంలో అతి త్వరలో పట్టాలెక్కనుంది. స్పానిష్ కంపెనీ టాల్గో.. ఢిల్లీనుంచి ముంబైకి నడపనున్న ఈ హైస్పీడ్ రైలు.. చివరి ట్రయల్ రన్ ఆగస్టు 1 సోమవారం ప్రారంభమైంది. టాల్గోట్రైన్ మొదటి ట్రయల్ రన్ ను ఇండియన్ రైల్వే.. ఈ సంవత్సరం మే నెల్లో ఉత్తరప్రదేశ్ లోని బైరెల్లీ నుంచి మొరాదాబాద్ వరకూ నిర్వహించింది. అనంతరం రెండో ట్రయల్ రన్ ను నార్గ్ సెంట్రల్ రైల్వే పల్వాల్ నుంచి మథుర వరకూ నిర్వహించింది. ఈ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్.. ట్రయల్ రన్స్ పూర్తి చేసుకొని ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తే.. ఢిల్లీనుంచీ ముంబైకి కేవలం 12 గంటల్లోనే చేరుకుంటుంది. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కార్లు, నాలుగు ఛైర్ కార్లు, ఒక కెఫ్టీరియా, ఒక పవర్ కార్, సిబ్బంది పనిముట్లకోసం ఓ చివరి కోచ్ లతో కలసి మొత్తం 9 కోచ్ లు ఈ రైల్లో ఉంటాయి.
ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి బయల్దేరే సూపర్ ఫాస్ట్ రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రైన్ ముంబై కి చేరేందుకు మొత్తం 1,384 కిలోమీటర్ల దూరాన్ని 16 గటల్లో చేరుతుండగా... త్వరలో ప్రారంభం కానున్న బుల్లెట్ ట్రైన్ 12 గంటల్లోనే చేరుకోగల్గుతుంది. టాల్గో కంపెనీ... ఈ కోచ్ లను సుమారు 30 ఏళ్ళ క్రితమే తయారు చేసింది. ఇప్పటివరకూ తజకిస్తాన్ తో సహా 12 దేశాల్లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యి, ప్రస్తుతం భారత్ లోనూ ఇంతకు ముందు రెండుసార్లు ట్రయల్ నిర్వహించిన అనంతరం తాజాగా చివరి ట్రయల్ రన్ ప్రారంభించింది.