'పెద్ద నోట్ల రద్దు భారీ కుంభకోణం?'
ముంబయి: పెద్ద నోట్లు రద్దు అనేది ఒక వ్యక్తి ఆలోచన ఆధారంగా చేసిన చర్య అని, ఇదొక భారీ కుంభకోణంగా మారవొచ్చని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. 'పెద్ద మొత్తంలో నల్లడబ్బును ఉపయోగించే వారు(మాల్యా, లలిత్ మోడీ) ఎలాంటి పన్ను కట్టకుండానే ప్రధాని మోదీ సాయంతో విదేశాలకు పారిపోయారని ఆయన ఆరోపించారు. బుధవారం ఇక్కడ కోర్టులో హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి బాంద్రా వద్ద మీడియా ప్రతినిధులతో రాహుల్ మాట్లాడారు.
తాను ఆర్థిక నిపుణులతో పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని చర్చించానని, ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా ఆలోచించలేదని, కేవలం ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆధారంగా దీనిని అమలుచేశారని చెప్పారు. ఎంతో సున్నితంగా దీనిని అమలు చేయాల్సిందని అన్నారు. 'నల్లడబ్బు కుబేరులు ఎవరినైనా మీరు బ్యాంకుల ముందు క్యూలో చూశారా? అక్కడ నిల్చున్నవారంతా రైతులు, ప్రభుత్వ సేవకులు, సాధారణ పౌరులు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నరేంద్రమోదీ తల్లి బ్యాంకుకు వెళ్లి డబ్బు మార్చుకోవడంపట్ల స్పందన కోరగా తన పద్ధతి వేరు, మోదీ పద్ధతి వేరని, తాను మోదీ తల్లిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. 'రెండు రోజుల కిందట ప్రధాని తన ప్రసంగంలో నవ్వారు. మరో రోజు ఏడుస్తున్నారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో ముందు నిర్ణయించుకోవాలి. నేను సోషల్ మీడియాలో బీజేపీ నాయకుల చేతుల్లో పెద్ద మొత్తంలో డబ్బును చూస్తున్నాను. వారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.