
మోదీకున్నంత వాక్చాతుర్యం రాహుల్‌కు లేదు
♦ కాంగ్రెస్‌కు సర్జరీ చేయాలి: దిగ్విజయ్
♦ ఓటమిపై విశ్లేషణకు త్వరలో సీడబ్ల్యూసీ భేటీ
♦ రాహుల్‌కు బాసటగా నిలిచిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకున్న వాక్చాతుర్యం రాహుల్ గాంధీకి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆమాటకొస్తే ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూలు కూడా గొప్ప వక్తలు కాదని.. కానీ వారికంటూ దేశం పట్ల దార్శనికత ఉందని, అందుకే వారి ప్రసంగాలను ప్రజలు శ్రద్ధగా వినేవారని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో డీలాపడిన కాంగ్రెస్‌కు తక్షణమే పెద్ద సర్జరీ అవసరమని అన్నారు. ఎన్నికల ఫలితాలపై చర్చోపచర్చలు, అంతర్మథనాలు అనవసరమని, పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని చెప్పారు.
సోనియా, రాహుల్ గాంధీలే పార్టీకి శస్త్ర చికిత్స చేయాలని హితవుపలికారు. కాంగ్రెస్ పునర్వైభవానికి అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌కు కొత్త రక్తం ఎక్కించాలని అభిప్రాయపడ్డారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఆ పార్టీ మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ స్పందించారు. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమ పార్టీ చెత్త ప్రదర్శనకు నిదర్శనమని.. అయితే ఇంతకంటే గడ్డుపరిస్థితుల్ని గతంలోనూ ఎదుర్కొందన్నారు.
కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కుదేలవడంతో ఆ పార్టీ అగ్రనాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ బాసటగా నిలిచింది. ఆయనొక్కరే సొంతంగా నిర్ణయాలను తీసుకోలేదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఉమ్మడిగా నిర్ణయాలను తీసకుందని పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో మీడియాకు చెప్పారు. అలాగే, ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర విభాగాలు అక్కడి పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకున్నాయన్నారు. అసెంబ్లీ ఫలితాలపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ త్వరలో సమావేశంకానుందని, త్వరలోనే తేదీని నిర్ణయిస్తారని చెప్పారు. బీజేపీతో జతకట్టిన కాంగ్రెస్ రెబల్స్ స్పందిస్తూ.. అవినీతి కేన్సర్‌తో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను ఎలాంటి శస్త్రచికిత్స రక్షించలేదన్నారు.