
తప్పు ఒప్పుకున్న దిగ్విజయ్ సింగ్
షాజాపూర్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూను రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆశారామ్ ఆశ్రమం కోసం ఇచ్చిన భూమి లీజును వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. షాజాపూర్ జిల్లా సుస్నెర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. తన పదవీ కాలంలోనే ఆశారామ్కు భూమి కేటాయించినట్లు చెప్పారు. ఇది తప్పిదమేనని ఆయన ఒప్పుకున్నారు.
1993 నుంచి 2003 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా దిగ్విజయ్ పనిచేశారు. ఆ సమయంలోనే ఇండోర్ బాపు ఆశ్రమం విస్తరణ కోసం భూమి కేటాయించారు. అప్పట్లో అన్నిరాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదన చేశాయని తెలిపారు. బాపు అసలు స్వరూపాన్ని ఎవరూ గుర్తించలేకపోయారన్నారు. ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 72 ఏళ్ల బాపు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.