
న్యూఢిల్లీ: మార్కులు, గ్రేడ్‌ల విషయంలో విద్యార్థులను తోటివారితో పోల్చవద్దని తల్లిదండ్రులు, టీచర్లకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సూచించింది. విద్యార్థుల్లో ఉన్న బలహీనతలను మరొకరితో పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనతా భావం వస్తుందని ఫలితంగా ఆత్మగౌరవం దెబ్బతింటుందని పేర్కొంది. దీనికి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక విద్యార్థి సాధించిన ఫలితాలను వేరొకరితో పోల్చడం సరికాదని తెలిపింది. దీని కంటే అదే విద్యార్థి గతంలో సాధించిన ఫలితాలతో పోల్చి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా మెరుగైన విజయాలు సాధించగలరని పేర్కొంది.
అలాగే ఓ విద్యార్థి మెరుగైన ఫలితాలు సాదించినప్పుడు వారిని అభినందించడం కూడా ముఖ్యమని సూచించింది. ఇలాంటి చర్యలతో వారిలో నేర్చుకోవాలనుకునే తపనతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది. నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అనేది కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని స్పష్టం చేసింది. దీనిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రిన్సిపల్స్ సహా అందరూ తమ బాధ్యతగా స్వీకరించాలని సూచించింది.