అబ్బో.. అంత ఖరీదా? | dog show in bangalore | Sakshi
Sakshi News home page

అబ్బో.. అంత ఖరీదా?

Published Mon, Nov 6 2017 9:07 AM | Last Updated on Mon, Nov 6 2017 9:07 AM

dog show in bangalore - Sakshi

టిబెటన్‌ మ్యాస్టిఫ్‌ శునకం (ఫైల్‌)..

సాక్షి,బెంగళూరు: ఆదివారం బెంగళూరులోని ఉదయభాను క్రీడామైదానంలో స్వదేశీ, విదేశీ శునకాల ప్రదర్శన నిర్వహించారు. ఇది సాధారణం కంటే ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే ఈ ప్రదర్శనలో ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీశ్‌ కడబమ్స్‌కు చెందిన కోట్ల రూపాయల విలువ చేసే టిబెటన్‌ మ్యాస్టిఫ్, ఆస్కాన్‌ మాలమ్యూట్, గ్రేట్‌ డేన్‌ తదితర విదేశీ జాతుల శునకాల ప్రదర్శనకు రావడమే. అందులో ముఖ్యంగా టిబెటన్‌ మ్యాస్టిఫ్‌ శునకం ప్రదర్శన మరింత ప్రత్యేకంగా నిలిచింది.ఆకారంలో అచ్చు సింహంలా ఉండే మ్యాస్టిఫ్‌ కుక్క కొనాలంటే అక్షరాలా రూ.2 కోట్లు చెల్లించాలి. గరిష్టంగా వీటి ధర రూ.10 కోట్ల వరకు పలుకుతుంది. ఇంత ధర, రూపం కలిగిన మ్యాస్టిఫ్‌ శునకం ఎంతో భయానక స్వభావం కలిగి ఉంటుందునకుంటే పొరబడినట్లే. ఆకారం భారీగా ఉండే ఈ శునకాలు కరవడం, కనీసం మొరిగే స్వభావం కూడా లేని మృదుస్వభావులు. దీంతో పాటు రూ.8 కోట్ల విలువ చేసే ఆస్కాన్‌ మాలమ్యూట్, రూ.1 కోటి విలువ చేసే కొరియన్‌ మ్యాపీ, రూ.6.50 లక్షల విలువ చేసే గ్రేట్‌డేన్‌ తదితర 20 విదేశీ జాతుల శునకాలను చూసి చూపరులు నోరెళ్లబెట్టారు.

అది నా హాబీ: సతీష్‌
శునకాల యజమాని సతీశ్‌ మాట్లాడుతూ అత్యంత ఖరీదైన, అరుదైన జాతుల శునకాలను పెంచుకోవడం తమకున్న అలవాటని తెలిపారు. అంతర్జాలం ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి బ్రోకర్ల సహాయంతో అరుదైన, ఖరీదైన జాతుల శునకాలను తెప్పించుకొని వాటిని పెంచుకుంటున్నామన్నారు. శునకాల కోసమే బెంగళూరు నగర శివార్లలోని కనకపుర రోడ్‌లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా షెడ్‌ను నిర్మించామన్నారు. ప్రస్తుతం తమ వద్ద సుమారు 150 జాతుల శునకాలు ఉన్నాయన్నారు. ఇక అన్నింటికంటే ఖరీదైన టిబెటన్‌ మ్యాస్టిఫ్‌ జాతి శునకాలు టిబెటియన్‌ సింహాల జీన్స్‌ నుంచి ఉత్పత్తి అయిన శునకమని అందుకే వాటి ఆకారం,ఆహార్యం అచ్చు సింహాలానే ఉంటుందన్నారు.అందుకే వీటికి ప్రపంచంలో ఏ జాతి శునకాలకు లేని డిమాండ్‌ ఉంటుందని వీటి పోషణకు నెలకు రూ.25వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాస్టిఫ్‌ జాతి శునకాలకు నెలకు ఒకసారి మాత్రమే స్నానం చేయిస్తే చాలని, అప్పుడే వాటి చర్మం,వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement