సాక్షి, న్యూఢిల్లీ: మొన్న ‘ఆయుష్మాన్ భారత్’, నిన్న ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ‘నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్’, నేడు ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్’ ఇలా పేర్లు మార్చుకుంటున్న పేద ప్రజల ఐదు లక్షల జాతీయ ఆరోగ్య భీమా పథకం సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎర్ర కోట వేదిక నుంచే ప్రకటించారు. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న ఈ పథకం అమలుపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల భారీ మొత్తాన్ని భీమాగా నిర్ణయించడం ఒక్కటయితే, దాన్ని ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించాలా? అన్న ప్రభుత్వ సంశయంపై ఈ అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి.
2016లో ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ పేద ప్రజల కోసం లక్ష రూపాయల ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అదే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018లో వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతూ ఐదు లక్షల రూపాయల భీమాతో కొత్తగా ప్రధాన మంత్రి ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈ పథకాన్ని తీసుకరావడం పట్ల పథకం పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఎంత ? అన్నది ఒక్క అనుమానమైతే, 2009 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ స్వస్త్ భీమా యోజన’ పథకాన్ని చిత్తశుద్ధితో మోదీ ప్రభుత్వం అమలు చేయక పోవడం ఆ అనుమానాన్ని మరింత బలపరుస్తోంది.
25 కోట్ల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకొని కుటుంబానికి 30 వేల ఆరోగ్య భీమాను కల్పిస్తూ నాటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ స్వస్త్ భీమా యోజన’ పథకంలో 3.6 కోట్ల మంది పేద ప్రజలు మాత్రమే స్కీమ్‌లో చేరారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంఘం ప్రశంసలు అందుకున్న ఈ స్కీమ్ ఇప్పుడు మంచం పట్టింది. ఈ స్కీమ్‌ను ఉపయోగించుకొని అటు ప్రైవేటు భీమా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రులు లాభ పడుతూ వస్తున్నాయి తప్పా, పేదలకు ఆరోగ్య సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ పథకానికి కేంద్రం 75 శాతం నిధులు సమకూరుస్తుండగా, 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఇప్పుడు ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య అభియాన్’లో 60 శాతం నిధులను కేంద్రం సమకూరుస్తుండగా, 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.
ఇప్పటికే అనేక రాష్ట్రాలు సొంతంగా పేదల కోసం ఆరోగ్య భీమా స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. వాటిలో కర్ణాటకలో ‘వాజపేయి ఆరోగ్య శ్రీ, తెలుగు రాష్ట్రాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ, తమిళనాడులో ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య భీమా పథకాలు సవ్యంగానే అమలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహానికి పోటీగా పంధ్రాగస్టు రోజునే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్కాయక్ పేదల కోసం ఐదు లక్షల రూపాయల భీమాతో ‘బిజూ పట్నాయక్ ఆరోగ్య భీమా పథకం’ను ప్రకటించారు. ఆ రాష్ట్ర జనాభాలోని 70 శాతం మంది, అంటే 70 లక్షల మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య స్కీమ్‌లను కూడా సమీక్షించి కేంద్రం రాష్ట్రాలతో కలిసి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమగ్ర ఆరోగ్య స్కీమ్‌ను తీసుకరావడం మంచిదని ఎప్పటి నుంచో ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. ప్రైవేటు భీమా కంపెనీలకు ఆరోగ్య భీమా కింద డబ్బులను కట్టబెట్టడంకన్నా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను అభివృద్ధి చేయడం అవసరమని కూడా వారు చెబుతూ వస్తున్నారు.
నరేంద్ర మోదీ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలనుకుంటే ప్రైవేటు భీమా కంపెనీలకు కాకుండా ప్రభుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో అమలు చేయడం మంచిదని జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంద్రానిల్ ముఖో«పాద్యాయ్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇందూ భూషణ్‌లు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మోదీ ప్రకటించిన ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ 28 రాష్ట్రాలు సంతకాలు చేయగా, వాటిలో 23 రాష్ట్రాలు భీమా కంపెనీలను వ్యతిరేకిస్తూ ట్రస్టీల వైపు మొగ్గు చూపడం విశేషం. కాకపోతే ఎక్కువ రాష్ట్రాలు స్వచ్ఛంద ట్రస్టుల వైపు మొగ్గు చూపడం విచారకరం. పథకాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టడం, వాటిని క్లుప్త పదంలో పిలవడం కూడా ముచ్చటగా ఉండాలని మోజుపడే మోదీ, ఆరోగ్య పథకానికి కూడా ‘పీఎమ్‌జా (పీఎంజెఏఏ)’ క్లుప్త పదం వచ్చేలా చూశారు. పీఎమ్‌జా కాస్త అబెఛా! కాకుండా చూసుకోవాలన్నదే ప్రజల కోరిక.
చదవండి: ఎవరి ఆరోగ్యం కోసం ఈ స్కీమ్
Comments
Please login to add a commentAdd a comment