
అందరి అండతో అందలం
‘ఆప్’కి అన్ని వర్గాల మద్దతు బీజేపీ, మోదీలకు దూరమైన మధ్యతరగతి, ఉన్నత వర్గాల ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ వాసులు గత ఏడాది (2014లో) జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలనూ భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో మోడీ హవా ఉత్తర భారతదేశాన్నంతటినీ చుట్టేసింది. అయితే.. అదే సమయంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి.. అంతకుముందు ఏడాది (2013) కంటే మూడు శాతం ఓట్లు పెరగడాన్ని గుర్తించలేకపోయింది. ఆప్‌కు ఆ మూడు శాతం ఓట్లు పెరగడానికి.. ఆ పెరిగిన నేపథ్యం రీత్యా చాలా ప్రాధాన్యం ఉంది. 2013 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు దిగువ తరగతుల్లో చాలా బలమైన పట్టు ఉందనే విషయంలో సందేహం లేదు. అదే సమయంలో మధ్యతరగతి ఓట్లను కూడా కొంత వరకూ ఆకర్షించింది. అయితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని ఓట్లను సాధించలేకపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని తరగతుల వారి నుంచీ ఓట్లు సాధించటమే కాదు.. మోదీ ‘సుపరిపాలన’ నినాదంతో మధ్యతరగతి నుంచి అనూహ్యమైన మద్దతును గెలుచుకుంది. అదే ఎన్నికల్లో ఆప్‌కు మూడు శాతం ఓట్లు పెరగడానికి కారణం.. దిగువ తరగతులు, మతపరమైన మైనారిటీల వారు ఆ పార్టీకి అనుకూలంగా మరింత ఎక్కువగా సంఘటితమవటం.. అది కూడా దెబ్బతిన్న కాంగ్రెస్ నుంచి ఇటువైపు మళ్లి ఉండటం కావచ్చు. 2013 ఎన్నికల్లో బీజేపీ, ఆప్ రెండిటికీ దక్కిన ముస్లిం ఓట్లు 12 శాతంగానే ఉండగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఓట్లు ఆప్‌కు 56 శాతం రాగా.. బీజేపీకి కేవలం 2 శాతం ఓట్లే దక్కాయి. ఈసారి కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుందని భావించారు. అందుకే ఎన్నికల ప్రచారంలో మతపరమైన విభజన, వర్గ విభజన చర్చలు నడిచాయి. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై విశ్వాసముంచి భారీగా మద్దతిచ్చిన మధ్యతరగతి, ఉన్నత తరగతి ప్రజల నమ్మకాన్ని.. బీజేపీ, మోదీ ఏ మేరకు చెదరగొట్టారన్నది ఈ ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన అంశం.
ఉన్నత తరగతి ఓట్లనూ గెల్చుకున్న ఆప్...
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్‌పీ ఓట్లను కొల్లగొడుతుందని ముందుగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పేర్కొన్నాయి. అయితే.. ఆప్‌ను ఏకంగా 67 సీట్లలో గెలిపించిన ఈ తరహా ప్రజాతీర్పు.. ఉన్నత తరగతి ఓట్లను కూడా ఆ పార్టీ గణనీయంగా గెలుచుకోగలిగిందనేదానికి స్పష్టమైన సంకేతం. తాజా ఎన్నికల్లో ఆప్‌కు 54.3 శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి 32.7 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 46 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 65 శాతం బ్రాహ్మణ ఓట్లను సంపాదించింది. అదే సమయంలో ఆ వర్గానికి చెందిన ఓట్లు ఆప్‌కు 2013లో 23 శాతం, 2014లో 22 శాతం లభించాయి. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్యలు కూడా రెండు పార్టీల మధ్య మారిపోయినట్లు ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.
బీజేపీ రాజకీయాలపై ఆ వర్గాల్లో ఆందోళన
ఈ ఎన్నికలను.. మతతత్వం - లౌకికవాదం చర్చపై ప్రజాతీర్పుగా ఎవరూ పేర్కొనలేదు. కానీ.. మతప్రాతిపదికగా వర్గసమీకరణ చేసే బీజేపీ ఎత్తుగడలపై భయాలు.. ఢిల్లీ ఎన్నికల్లో అంతర్లీన ప్రచారాంశాలుగా మారాయి. సంఘ్ నేతలు తమ ఖాకీ నిక్కర్ల జేబుల నుంచి వరుసపెట్టి బయటకు తీస్తున్న అంశాల పట్ల మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. లవ్ జిహాద్, ఘర్ వాపసి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీపై వివాదం, బీజేపీ ఎంపీల దుందుడుకు వ్యాఖ్యలు, పితృస్వామ్యంతో సతమతమవుతున్న మహిళలకు పురాతన పరిష్కారాలు చూపడం.. ఇలా అంతూపొంతూ లేకుండా హిందుత్వ దుడుకు వ్యక్తుల చర్యలు కొనసాగుతున్నాయి. మోదీ, పరిపాలన, అభివృద్ధికి సంబంధించి ఆయన అతిశయ ప్రచారంలో మంత్రముగ్ధులై ఉన్న ఢిల్లీ మధ్యతరగతి వారికి.. ఈ పరిణామాలు.. విస్మరించదగిన మతిలేని దళాల కోతిచేష్టలుగానో.. ఢిల్లీని తాకనంత సుదూరాన ఎక్కడో జరుగుతున్న పరిణామాలుగానో భావించి ఉండొ చ్చు. కానీ.. ఇటీవలి నెలల్లో ఈ పరిణామాలు చాలా దగ్గరగా చోటుచేసుకోవటం మొదలైంది.
ఢిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత బవానా, నాంగ్లోయి, నంద్ నగిరి, ఓఖ్లాల్లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు కల్పిత ప్రయత్నాలు జరిగాయి.. రెండు నెలల్లో మొత్తం ఐదు చర్చిలపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలతో సంఘ్ గురించి మధ్య, ఉన్నత తరగతి ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న భయాలు రగులుకున్నాయి. మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాలు.. బీజేపీ మతతత్వ పోకడల వల్ల లేక అటువంటి రాజకీయాలు సామాజిక సుస్థిరత, శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తాయని ఆ పార్టీకి దూరమయ్యారా? అనేది చెప్పటం కష్టం. చర్చిలపై దాడులకు సంబంధించి ఏ బీజేపీ కార్యకర్తనూ నిందితుడిగా పేర్కొనలేదనేది వాస్తవం. అయినా.. అధికార పార్టీకి అనుసరించే తరహా రాజకీయాలు.. హింస అనివార్యమనే వాతావరణం సృష్టిస్తాయని దాదాపు ఏకగ్రీవంగా గుర్తిస్తారు. ఇది.. మహాత్మా గాంధీ హంతకుడైన నాథూరాంగాడ్సేను ప్రస్తుతించటంలో చక్కగా ప్రతిబింబిస్తుంది. మోదీ ప్రతి మూడు వారాలకోసారి మహాత్ముడిని ప్రస్తుతిస్తుండటం.. మరోవైపు ఆయన పార్టీ ఎంపీలు, కార్యకర్తలు గాడ్సేను కీర్తిస్తుండటం కొంత గందరగోళానికి గురిచేస్తుంది. ఇదంతా ప్రత్యేకించి ఢిల్లీ మధ్యతరగతిని ఆందోళనకు గురిచేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి ఉత్సాహంగా మద్దతివ్వటానికి కారణమైన ఉత్తమ పాలన అనే భావనను బీజేపీ రాజకీయాలు అతిక్రమిస్తున్నట్లు కనిపించటమే దీనికి కారణం.
బురదజల్లుడు ప్రచారంతోనూ నష్టం
ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఆప్‌పైన, కేజ్రీవాల్‌పైన బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో.. భరోసా ఇస్తూ, కలలు అల్లుతూ, తన ఎజెండా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేసిన మోదీ అదృశ్యమయ్యారు. కేజ్రీవాల్ దురదృష్టవంతుడు, నక్సలైట్, అరాచకవాది, 49 రోజుల ఉత్పాతం అంటూ విమర్శలు మొదలుపెట్టారు. అమిత్‌షా మరొక అడుగు ముందుకువేసి.. కేజ్రీవాల్‌ను ప్రజలు కొట్టిచంపేవాళ్లని.. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆప్ హవాలా మార్గాల ద్వారా విరాళాలు తీసుకుంటోందని బీజేపీ ఆరోపించింది. కానీ.. తానేమో రోజుల తరబడి దినపత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు జారీ చేసింది. ఈ కారణాల వల్ల.. ఢిల్లీలో తమ ఓటు ద్వారా మోదీ, బీజేపీలను హెచ్చరించాలని మధ్యతరగతి, ఉన్నత తరగతి వర్గాలు భావించాయి. ఫలితంగా.. ఆప్‌కు మద్దతుగా ఉండేది దిగువ తరగతి వర్గాల వారికే పరిమితమన్న భావన పొరపాటని రుజువుచేస్తూ.. సంపన్న వర్గాల ఓట్లనూ ఆ పార్టీ కొల్లగొట్టింది. ఢిల్లీలో అత్యంత సంపన్న ప్రాంతాలుగా పరిగణించే న్యూఢిల్లీ, ఆర్.కె.పురం, గ్రేటర్ కైలాశ్, మాల్వియానగర్‌లలోనూ ఆప్ ఘన విజయం సాధించింది.