ఆహ్లాదం నుంచి హాహాకారాల దాకా..
* కెమెరాకు చిక్కిన విద్యార్థుల విషాదాంతం
* నెట్‌లో దావానలంలా పాకిన ‘దారుణ’ వీడియో
మండి: అసలే యువోత్సాహం. ఆపై నయనానందకరంగా ప్రకృతి సోయగం. ఆహ్లాదకరమైన వాతావరణాన్నిమనసారా ఆస్వాదించాలనుకున్నారు. అరికాలి కంటే లోతు లేదన్న ధీమాతో నదీ మధ్యంలోకి పరుగులు తీశారు. నవ్వులు, కేరింతలతో కేక పుట్టించారు. ఆ ఆనందమయ క్షణాలను శాశ్వతం చేసుకునేందుకు కెమెరాలకు, సెల్ ఫోన్లకు పని చెబుతూ సందడి చేశారు. కానీ తాము అడుగు పెట్టింది సరాసరి మృత్యువు ఒడిలోకేనని అర్థమయ్యేసరికి ఆలస్యమైపోయింది. ఉరుముల్లేని పిడుగులా శరవేగంతో తమను చుట్టుముడుతున్న జలరక్కసిని చూసి విద్యార్థులంతా ఒక్కసారిగా భీతిల్లారు. తప్పించుకునేందుకు సమయం గానీ, దారి గానీ లేక పూర్తిగా నిస్సహాయులైపోయారు.
ఈదుతూ ఎలాగైనా ఒడ్డు చేరేందుకు ఒకరిద్దరు విఫలయత్నం చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా హాహాకారాలు చేస్తూ, ఆక్రందనల నడుమ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. క్షణాల వ్యవధిలో మూకుమ్మడిగా జలసమాధైపోయారు. కన్నవారికి తీరని గర్భశోకం మిగిల్చారు. గుండెల్ని మెలిపెట్టే ఈ హిమాచల్‌ప్రదేశ్ ఘోర కలికి సాక్ష్యంగా నిలిచిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. విద్యార్థులు సరదాగా గడుపుతుండటం, వారికి ఎగువనే అతి సమీపంలో ఉన్న మలుపు గుండా ఉప్పెన ఆకస్మికంగా వచ్చి పడటం, ఎలాగైనా ప్రాణాలు కాపాడుకునేందుకు వారంతా విఫలయత్నం చేయడం, నిస్సహాయంగా కొట్టుకుపోవడం వంటివన్నీ ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎగువన హైవేపై ఉన్న ఆగంతకుడెవరో తన కళ్లెదుట నదిలో సాగిన మరణమృదంగాన్ని వీడియోలో బంధించి ప్రపంచం ముందుంచాడు. ఇంటర్నెట్‌లో దావానలంలా పాకిన ఆ వీడియోలోని దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.