న్యూఢిల్లీ: నగరంలో ఈ రిక్షాలు నడుస్తున్నా ట్రాఫిక్ పోలీసులు, ట్రాన్స్‌పోర్టు విభాగం అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు మంగళవారం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నగరంలో ఈ రిక్షాలపై హైకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ నగరంలో ఈ రిక్షాలు నడుస్తున్నా పై రెండు విభాగాలు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కారణంగా కోర్టు ధిక్కార చర్యలు ఎందు తీసుకోకూడదని ఆయా విభాగాలను ప్రశ్నించింది. ఈ రిక్షాల సైజులో సాంకేతికలోపంతోపాటు, వాటి టైర్లు ఉబ్బి ఉన్నాయని, ఇవి నగర రోడ్లపై తిరగడం సరైందకాదని ఆయా విభాగాలకు సూచిస్తూ సెప్టెంబర్ 9వ తేదీన హైకోర్టు నిషేధం విధించింది.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) అనిల్‌కుమార్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సతీష్ మాధుర్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 18వ తేదీలోగా సమర్పించాలని జస్టిస్ వీకే షాలీ చెప్పారు. ఈ రిక్షాలు వివిధ తేదీల్లో నగరంలో తిరిగినట్లు ఆధారాలు చూపే దృశ్య చిత్రాలను పిటిషనర్ షహనావాజ్ ఖాన్ కోర్టు సమర్పించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పోలీసులు ఈ రిక్షాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. చాందీచౌక్ ప్రాంతంలో ఈ రిక్షాలు తిరిగినట్లు కోర్టు పరిశీలనలో కూడా వెల్లడైందన్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీమ్‌సేన్ బాసీతోపాటు ప్రతివాదుల తరఫున న్యాయవాది జుబేదా బేగం వాదించారు.
ట్రాన్స్‌పోర్టు విభాగం అక్టోబర్ 8వ తేదీన నగరంలో ఈ రిక్షాలు నడవడానికి అనుమతి ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ రిక్షాలకు వ్యతిరేకంగా వచ్చిన అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు. తదుపరి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు కోర్టుకు సూచించారు. న్యాయవాది సుగ్రీవ్ దుబే ద్వారా పిటిషనర్ షహనావాజ్ వేసిన కోర్టు ధిక్కార ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోర్టు సెప్టెంబర్ 9వ తేదీన నగరంలో ఈ రిక్షాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ రిక్షాలు నగరంలో కొనసాగుతున్నాయి. దీనిపై నిర్ణీత గడువులోగా కోర్టుకు సమాధానం చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
నిషేధాలు ఉల్లంఘిస్తున్న ఈ రిక్షాలు
Published Tue, Oct 28 2014 10:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM
Advertisement
Advertisement