
ప్రతీకాత్మక చిత్రం
ఆడ ఏనుగు కోసం రెండు మగ ఏనుగుల మధ్య పోటీ నెలకొందని, రెండునూ భీకరంగా పోరాడుకునే సమయంలో దంతం బలంగా గుచ్చుకోవడంతో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మనుషులకైనా, మృగాలకైనా.. ప్రేమంటే ప్రేమే. గజరాణి కోసం రెండు గజరాజులు భీకర ప్రేమపోరాటం సాగించాయి. చివరకు ఒక మగ గజరాజు దారుణంగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. నీలగిరి జిల్లా ముదుమలై అడవుల్లో ఒక ఏనుగు చచ్చిపడి ఉన్నట్లు అటవీశాఖాధికారులకు సమాచారం అందింది. నెలాకోట్టై రేంజర్ సురేష్‌కుమార్, పశువైద్యులు నందిని, కోశలన్ బుధవారం అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిర్వహించి వివిధ పరీక్షల నిమిత్తం ఏనుగు అవయవాలను సేకరించారు.
132 సెంటీమీటర్ల దంతాలను సేకరించి ఇతర వన్యప్రాణుల ఆహారం కోసం ఏనుగు మృతదేహాన్ని అక్కడే వదిలేశారు. అడవిలో సంచరించే ఒక ఆడ ఏనుగు కోసం రెండు మగ ఏనుగుల మధ్య పోటీ నెలకొందని, రెండునూ భీకరంగా పోరాడుకునే సమయంలో దంతం బలంగా గుచ్చుకోవడంతో వాటిల్లోని 20 ఏళ్ల మగ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని అటవీ అధికారులు తెలిపారు.