అది కాంగ్రెస్‌ ప్రాయోజిత కుట్ర | EVMs rigging in the Lok Sabha elections | Sakshi
Sakshi News home page

అది కాంగ్రెస్‌ ప్రాయోజిత కుట్ర

Published Wed, Jan 23 2019 4:03 AM | Last Updated on Wed, Jan 23 2019 9:13 AM

EVMs rigging in the Lok Sabha elections - Sakshi

న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్‌ జరిగిందని లండన్‌లో సైబర్‌ భద్రతా నిపుణుడు ఆరోపించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలు కాంగ్రెస్‌ ప్రా యోజిత కుట్రలో భాగమని మంగళవారం తిప్పికొట్టింది. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘానికి తలవంపులు తేవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే సాకులు వెతకడం ప్రారంభించిందని ఎద్దేవా చేసింది.

షుజా పాల్గొన్న లండన్‌ ఈవీఎం హ్యాకథాన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ఈవీఎంలను హ్యాకింగ్‌ చేసి గత ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనం పొందిందని సయ్యద్‌ షుజా అనే నిపుణుడు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈవీఎం హ్యాకింగ్‌ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. షుజాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసే, వదంతులు వ్యాపింపజేసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలని కోరింది. 

సిబల్‌కు అక్కడేం పని? 
కపిల్‌ సిబల్‌ ఏ హోదాతో లండన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ‘సిబల్‌ అక్కడ ఏం చేస్తున్నారు? ఏ హోదాతో ఆయన అక్కడికి వెళ్లారు? భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్‌ స్పాన్సర్‌ చేసిన కుట్ర ఇది. అంతా కాంగ్రెస్‌ రచించిన ప్రణాళిక ప్రకారమే జరిగింది’ అని ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతోనే లండన్‌ కార్యక్రమానికి వెళ్లానన్న సిబల్‌ వివరణను రవిశంకర్‌ కొట్టిపారేశారు. ఆ కార్యక్రమానికి హాజరైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియనంత అమాయకుడు సిబల్‌ కాదని అన్నారు. సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా సైబర్‌ భద్రతా రంగంలో వస్తున్న మార్పులపై నిత్యం నిపుణులతో మాట్లాడతానని, కానీ తాను సయ్యద్‌ షుజా అనే పేరును ఎప్పుడూ వినలేదని చెప్పారు. లండన్‌లో జరిగిన ప్రెస్‌ మీట్‌ ఒక డ్రామా అని,  ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా మీడియా ముందుకు రాకుండానే షుజా పెద్దపెద్ద ఆరోపణలు చేశారని అన్నారు. 

షుజా మా ఉద్యోగి కాదు: ఈసీఐఎల్‌ 
షుజా చెప్పుకున్నట్లుగా ఆయన తమ సంస్థలో ఉద్యోగి కాదని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) స్పష్టతనిచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను రూపొందించిన ఈసీఐల్‌ నిపుణుల బృందంలో తానూ ఒకడినని షుజా తెలిపిన సంగతి తెలిసిందే. ఈవీఎంల రూపకల్పనకు షుజాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ సంస్థలో ఉద్యోగి కూడా కాదని ఈసీఐఎల్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సుదీప్‌ జైన్‌కు లేఖ రాసింది.
 
రేడియో ఫ్రీక్వెన్సీతో చొరబడలేం: ఈసీ
ఈవీఎంలు రిగ్గింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యమని వాటిని రూపొందించిన నిపుణుల కమిటీ పునరుద్ఘాటించిందని తెలిపింది. ఈవీఎం యంత్రాలు..బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్, వీవీప్యాట్‌లకు మాత్రమే అనుసంధానమై ఉంటాయని, ఏదైనా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ మార్గం లో వాటిలోకి చొరబడటం సాధ్యం కాదని నిపుణుల కమిటీని ఉటంకిస్తూ ఈసీ పేర్కొంది.

నిర్వాహకుడు కాంగ్రెస్‌ మనిషి
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వయం ప్రకటిత సైబర్‌ భద్రతా నిపుణుడు షుజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగను రేపాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లండన్‌లో  షుజా పాల్గొన్న మీడియా సమావేశం నిర్వహించిన ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఆశిష్‌ రే కాంగ్రెస్‌ మనిషని అన్నారు. చాన్నాళ్లుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని పొగుడుతున్న రే...కాంగ్రెస్‌ పత్రిక నేషనల్‌ హెరాల్డ్‌కు వ్యాసాలు రాస్తున్నారని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని తరచూ విమర్శించారని ప్రస్తావించారు. గతంలో లండన్‌లో రాహుల్‌ గాంధీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై రే స్పందించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement