21వ లా కమిషన్ చైర్మన్ గా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బల్బీర్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. గత సెప్టెంబర్ నుంచి ఖాళీగా ఉన్న చైర్మన్ పోస్టులో ప్రభుత్వం చౌహాన్ ను భర్తీ చేసినట్లు న్యాయశాఖామంత్రి డి వి సదానందగౌడ ఓ ట్వీట్ లో తెలిపారు. 66ఏళ్ళ జస్టిస్ చౌహాన్ ప్రస్తుతం కావేరీనది నీటి వివాదల ట్రిబ్యునల్ లో ఉన్నారు.
జస్టిస్ చౌహాన్ 2009 నుంచి 2014 జూలై వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన జూలై 2008 నుంచి 2009 మే వరకూ ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి చైర్మన్ పోస్ట్ ఖాళీగానే ఉండగా... లా ప్యానెల్ సభ్యులుగా గతేడాది మేలో పదవీ విరమణ చేసిన 62 ఏళ్ళ గుజరాత్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి రవి ఆర్ త్రిపాఠీని నియమించారు. అయితే అప్పట్నుంచీ పెండింగ్ లోనే ఉన్న లా కమిషన్ ఛైర్మన్ ఎంపిక మాత్రం అనేక కారణాలతో ఆలస్యం అవుతూనే వచ్చింది.
లా కమిషన్ ఛైర్మన్ ఎంపిక కోసం గతేడాది ప్రధానమంత్రి కార్యాలయానికి... న్యాయ మంత్రిత్వ శాఖ 48 మంది హైకోర్టు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల జాబితాను పంపింది. 20వ లా కమిషన్ ఛైర్మన్ పదవీకాలం గత ఆగస్టు 30 తో పూర్తవ్వడంతో సెప్టెంబర్ 9 నాటికి 21వ లా కమిషన్ ఛైర్మన్ ను ఎంపిక చేసేందుకు అప్పట్లో న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 నాటికే 21వ లా ప్యానెల్ సృష్టించాలని ప్రకటన కూడ ఇచ్చింది. అయితే అప్పటినుంచీ పెండింగ్ లో ఉన్న లా కమిషన్ చైర్మన్ పదవిలో చివరికి బల్బీర్ సింగ్ చౌహాన్ ను నియమించినట్లు వెల్లడించింది.
లా కమిషన్ ఛైర్మన్ గా బల్బీర్ సింగ్
Published Thu, Mar 10 2016 7:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM
Advertisement