ముంబై: ‘మహా’ ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివిధ పార్టీల నేతల వ్యాఖ్యల మాటెలా ఉన్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు మాత్రం పడటం లేదు. ముఖ్యమంత్రి పీఠం సహా అధికార పంపిణీ సమంగా జరగాలన్న తమ డిమాండ్ నుంచి శివసేన వెనక్కు తగ్గడంలేదు. అదే విషయాన్ని మంగళవారం శివసేన నేత సంజయ్ రౌత్ మరోసారి తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు జరగాలంటే.. అధికారాన్ని సమంగా పంచుకోవడంపై బీజేపీ లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనన్నారు. శివసేన నేతనే మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి అవుతాడని పునరుద్ఘాటించారు. సేన, బీజేపీల కూటమికి మెజారిటీ లభించినా.. రెండు పార్టీల మధ్య అధికార పంపిణీ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అక్టోబర్ 24వ తేదీ నుంచి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే.
మరోవైపు, బీజేపీ నుంచి మంగళవారం ఒక ఆశావహ ప్రకటన వెలువడింది. ‘ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన శుభవార్త ఏ క్షణమైనా రావొచ్చు’ అని సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ నివాసంలో జరిగిన పార్టీ సీనియర్ నేతల భేటీ అనంతరం ఆయన ఆ వ్యాఖ్య చేశారు. ఆ భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌పాటిల్ మాట్లాడుతూ.. శివసేన నుంచి సానుకూలమైన ప్రతిపాదన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బీజేపీతో, ఎన్డీయేతో శివసేన సంబంధాలు తెంచుకుంటేనే.. రాజకీయ ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రకటించింది.
ఆరెస్సెస్ చీఫ్‌తో ఫడ్నవిస్ భేటీ
ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు పరిష్కారం లభించని నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యేందుకు మంగళవారం రాత్రి నాగపూర్ వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇరువురు ఏం చర్చించారనే విషయంలో ఆరెస్సెస్ వర్గాలు నోరు విప్పడం లేదు
Comments
Please login to add a commentAdd a comment