
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన శ్రీనగర్‌లోని తన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. పీఎస్‌ఏ కింద ప్రభుత్వం ఓ వ్యక్తిని రెండేళ్ల పాటు విచారణ లేకుండానే నిర్బంధంలో ఉంచవచ్చు. పీఎస్‌ఏ కింద ఫరూక్ అబ్ధుల్లాను ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన నివాసాన్ని అనుబంధ జైలుగా ప్రకటించారు. దీంతో ఆయన తన నివాసంలోనే ఉంటూ బంధువులు, స్నేహితులను కలుసుకునే వీలుంది. గతంలో కశ్మీరీ నేత షా ఫైజల్‌ను సైతం పీఎస్‌ఏ కింద నిర్భందంలోకి తీసుకున్నారు. మరోవైపు ఫరూక్ అబ్దుల్లాను కోర్టు ఎదుట హాజరుపరచాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 30న ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టనున్నట్టు సుప్రీం బెంచ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment