
‘యూఎస్ ఆఫర్‌ను తీసుకోండి ప్లీజ్.. వద్దనొద్దు’
కశ్మీర్ సమస్య విషయంలో మూడో వ్యక్తి జోక్యానికి ఒప్పుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శ్రీనగర్: కశ్మీర్ సమస్య విషయంలో మూడో వ్యక్తి జోక్యానికి ఒప్పుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేలా మధ్యవర్తిత్వం నడిపేందుకు సిద్ధమంటూ ప్రకటించిన అమెరికాను భారత్, పాకిస్థాన్ అంగీకరించాలని ప్రాధేయపడుతున్నానని అన్నారు. కశ్మీర్ విషయంలో ఎన్నిరకాల ప్రత్యమ్నాయాలుంటే అన్నింటిని ఉపయోగించుకోవాలంటూ వ్యాఖ్యానించారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలను నివారించేందుకు, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు, కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధమని అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తాము మూడో వ్యక్తి జోక్యానికి అనుమతించబోమని భారత్ వెంటనే స్పష్టం చేసింది కూడా. అయినప్పటికీ ఫరూక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. ‘70 ఏళ్లుగా కశ్మీర్ సమస్య విషయంలో భారత్, పాక్ విఫలమయ్యాయి.
మన పిల్లలు వారి జీవితాలు కోల్పోతుంటే ఇంకా ఎంత కాలం చూడాలి? భారత్, పాక్‌లకు నేను ఈ సందర్భంగా ఒక విషయం ప్రాధేయపడి చెబుతున్నాను. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం సహా అన్ని రకాల ప్రత్యామ్నాయాలకు అవకాశం ఇవ్వండి. వేల మంది జీవితాలు బలితీసుకుంటున్న ఈ అపరిష్కృత సమస్యకు ఇకనైనా ముగింపు పలకండి’ అంటూ ఫరూక్ వ్యాఖ్యానించారు.