'ఆమె మమ్మల్ని నమ్మట్లేదు. అందుకే..'
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తన ఎంపీలపై నమ్మకంపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎక్కడ వారు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడతారోనని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వారు కచ్చితంగా తమ రాష్ట్రంలోని కోల్‌కతాలో ఓటు హక్కు వినియోగించుకోవాలని హుకుం జారీ చేసినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సుగతాబోస్, కేడీ సింగ్‌వంటి ఏంపీలు కూడా కోల్‌కతాలోనే ఓటు హక్కును వినియోగించుకోనున్నారంట.
ఈ నెల 1న టీఎంసీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరికీ ఒక ఎస్సెమ్మెస్ రూపంలో సమాచారం అందింది. ఎక్కడ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నారో చెబుతూ ఎన్నికల కమిషన్ పంపించే పత్రాల్లో నింపి వాటిని టీఎంసీ కార్యదర్శి(మమతకు విశ్వసనీయుడు) మానిక్‌దాకు ఇవ్వాలని ఆ సమాచారం ఉంది. దీని ప్రకారమే ఓటు హక్కు కోల్‌కతాలో వినియోగించుకోవాలనుకున్న ఎంపీలంతా కూడా ముందు ఆ పత్రాలను మమత వద్దకు పంపి ఆ తర్వాతే ఎన్నికల కమిషన్‌కు పంపించారట. ఇదే విషయాన్ని ఓ పేరు చెప్పేందుకు ఇష్టపడని ఎంపీ తెలుపుతూ 'ఆమె మమ్మల్ని పూర్తిగా నమ్మడం లేదు. అందుకే ముందు మా ఓటింగ్‌కు సంబంధించిన పత్రాలను ఆమెకు పంపించాం. ఆ తర్వాతే అవి ఎన్నికల కమిషన్‌కు వెళ్లాయి' అని తెలిపారు. అంతేకాదు, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఈ పత్రాలన్నింటిని స్వయంగా తీసుకెళ్లి ఎన్నికల కమిషన్‌కు సమర్పించారంట.