
పాలరాతి మందిరంపై పచ్చని మచ్చలు
లక్నో: ప్రఖ్యాత ప్రపంచ వారసత్వ కట్టడం తాజ్‌మహల్‌పై ఏర్పడుతున్న పచ్చని మచ్చలకు కారణాలు అన్వేషించి దానికి పరిష్కార మార్గాలను తెలియజేస్తూ తనకు నివేదించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం ప్రభుత్వ అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు.
పాలరాతి మందిరమైన తాజ్‌మహల్‌పై ఏర్పడుతున్న మచ్చలకు యమునానదిలో పారవేస్తున్న కాలుష్య వ్యర్థాలు కారణం కావచ్చని, ఇది కాకుండా ఇతరత్రా కారణాలు ఉంటే వాటిని పరిశీలించి వాస్తవాలు కనుగొనాలని సీఎం ఆగ్రా డివిజినల్ కమిషనర్,జిల్లా మేజిస్ట్రేట్, పీడబ్లూడీ విభాగం, ఆర్కియాలజీ, కాలుష్యనియంత్రణ మండలి అధికారులను కోరారు.
కాగా కాలుష్యంబారిన పడుతున్న తాజ్ పరిరక్షణా చర్యలపై గతవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు, యూపీ ప్రభుత్వానికి, నోటీసులు జారీచేసిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పై చర్యలకు ఉపక్రమించింది.