బిహార్ టాపర్స్ స్కాంలో మరో సంచలనం!
పాట్నా: బిహార్ టాపర్స్ స్కాం వరుసలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. జేడీయూ మాజీ మహిళా ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో అత్యంత దారుణమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం.
అంతేకాదు అవధ్ యూనివర్సిటీ నుంచి 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు ఆమె సమర్పించిన అఫిడవిట్లో పేర్కొనగా.. యూనివర్సిటీ ప్రారంభమైందే 1976లో. అయినా రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఒకే ఏడాదిలో ఎలా కంప్లీట్ చేశారు అనే విషయం అంతుచిక్కడం లేదు. ఉషా సిన్హా తన పీహెచ్డీని సైతం 23 ఏటా పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొనడం చూసి ఇప్పుడు అంతా నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఆమె పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లో హిందీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. టాపర్స్ స్కామ్లో ఉషా సిన్హా పేరు కూడా వినిపిస్తోంది. ఈమె భర్త లోకేశ్వర్ ప్రసాద్ గతంలో బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు చైర్మన్గా పనిచేశారు.