శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకోవాలని కేంద్రప్రభుత్వం భావిస్తే, వెంటనే రాష్ట్రానికున్న స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘మేం స్వయం ప్రతిపత్తి, భారత్‌లో విలీనం పరిస్థితులపై మాట్లాడితే మమ్మల్ని దేశ ద్రోహులుగా, దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. మా విధేయతకు దక్కిన బహుమతి ఇదేనా? మేం మిమ్మల్ని(భారత్) ప్రేమతో అంగీకరించాం. కానీ మీరు దాన్ని అర్థం చేసుకోకుండా మా సర్వస్వాన్ని లాగేసుకున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గుర్తుంచుకోండి. మీరు మనసులు గెలుచుకునేంతవరకు జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతాలు మిమ్మల్ని అంగీకరించవు’ అని అన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇక్కడి జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఫరూక్ మాట్లాడారు. కశ్మీర్‌లో సైన్యం తనపని తాను చేసుకుపోతుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై ఫరూక్ తీవ్రంగా స్పందించారు. ‘మమ్మల్ని బలప్రయోగం ద్వారా అణచివేయవచ్చని కేంద్రం భావిస్తోంది.రావత్ గారూ.. నామాట గుర్తుంచుకోండి. మీరు ఎంతమందిని చంపినా, ఎంతమందిని అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచినా, మేం భయపడేది లేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment