సాక్షి, ముంబై: కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళీ దేవరా మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానాన్ని ఆయన కుమారుడు మిలింద్ దేవరాకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. దేవరా కుటుంబానికి అన్ని పార్టీలతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఎన్సీపీ, శివసేన మద్దతు కూడగట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
మరోపక్క గత రెండు, మూడు నెలలుగా బీజేపీ వైఖరిపై విసిగెత్తిన శివసేనకు ప్రతీకారం తీర్చుకునేందుకు మంచి అవకాశం లభించింది. మురళీ దేవరా మృతితో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంపై త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణం మరోసారి వేడెక్కనుంది. ఆరు నెలల కిందటే దేవరా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవి కాలం గడువు 2020లో ముగియాల్సి ఉంది. కాని ఆయన ఇలా మృతి చెందడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడం కాంగ్రెస్‌కు సవాలుగా మారనుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ ఈ స్థానాన్ని భర్తి చేయాలంటే సాధ్యమయ్యే పనికాదు.
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ స్థానంపై తప్పకుండా కన్నువేసే అస్కారముంది. బీజేపీ వద్ద 130 మంది ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ రాజ్యసభ సీటును గెలిచేందుకు మరో 15 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. అందుకు శివసేన లేదా ఎన్సీపీ మద్దతు కూడగట్టుకోవల్సి ఉంటుంది. కాని గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి ప్రతీకారం తీర్చుకోవాలని శివసేన యోచిస్తోంది.
బీజేపీ అభ్యర్ధి రాజ్యసభకు వెళ్లకుండా ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీ సహా శివసేన కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మురళీ తనయుడు మిలింద్‌కు ఆ స్థానానికి నిలబెట్టాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేయనుంది.
మురళీ దేవరా మృతికి సీడబ్ల్యూసీ సంతాపం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా మృతికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మంగళవారం సంతాపం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగి కమిటీ సమావేశంలో వక్తలు ఆయన సేవలను కొనియాడారు.
ఇందిరాగాంధీ హయాంలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మురళీ దేవరా పార్టీకి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని వారు పేర్కొన్నారు. కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన దేవరా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నారని పేర్కొన్నారు. మురళీదేవరా(77) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ముంబైలో మృతిచెందిన విషయం తెలిసిందే.
రాజ్యసభ బరిలో మిలింద్ దేవరా?
Published Tue, Nov 25 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement