రూ.251 ఫోన్కు ఆర్డరిచ్చే ముందు జాగ్రత్త!
నోయిడా: ఆశ.. దోశ.. అప్పడం.. వడ అన్నతీరుగా ఉంది రింగింగ్ బెల్స్ కంపెనీ వ్యవహారం. కేవలం రూ.251కే స్మార్ట్ ఫోన్ విడుదల చేసి మొబైల్ రంగాన్ని ఓ కుదుపుకుదిపేసినట్లు కనిపించిన ఆ సంస్థ గురువారం చేతులెత్తేసి విమర్శలు రావడంతో తిరిగి శుక్రవారం ఫోన్ బుకింగ్ కోసం అవకాశం కల్పించింది. బుధవారం ఈ ఫోన్ విడుదల చేసిన ఆ సంస్థ తమ ఫోన్ బుకింగ్లకోసం అనూహ్య స్పందన వచ్చిందంటూ బుకింగ్ అవకాశాలను గురువారం తాత్కాలికంగా నిలిపేసింది.
అయితే, ఇలా నిలిపేయడంపట్ల సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థకు చెందిన ఫ్రీడమ్ 251 మొబైల్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో వాటిని తాత్కాలికంగా నిలిపేసి తిరిగి శుక్రవారం ప్రారంభిస్తున్నామని చెప్పింది. అయితే, శుక్రవారం ఈ ఫోన్ బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు ముందే తెలుసుకుంటే మంచిది.
బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
1. రింగ్ బెల్స్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి ట్రాక్ రికార్డు లేని ఓ ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లో నాణ్యత ఎంతమేరకు ఉంటుందనే విషయం అంచనా వేయడం సాధ్యం కాదు.
2. మొబైల్ ఫోన్ షిప్పింగ్కు నాలుగు నెలలు సమయం పడుతుంది. ఇది దృష్టిలో ఉంచుకొని ఫోన్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, బుక్ చేసుకున్న వారందరికీ ఈ ఫోన్ డెలివరీ వస్తుందని మాత్రం అనుకోలేం.
3. ఫోన్ లాంచింగ్ సమయంలో ఫ్రీడమ్ 251 కు ఒక సంవత్సరంపాటు వారంటీ ఉంటుందని చెప్పింది. కానీ, వెబ్ సైట్లో మాత్రం రిటర్న్ పాలసీ వివరాలేవీ పెట్టలేదు.
4. ఫోన్ ధర రూ. 251 కాగా, చేరవేతకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.
5. ఈ ఫోన్లు కేవలం భారత్లో మాత్రమే డెలివరీ చేస్తారు. బయట దేశాల్లో ఉండే భారతీయులకు అందుబాటులో ఉండదు.