గాజర్ల రవి తప్పించుకున్నాడా?
12 మంది మహిళా మావోయిస్టులు మృతి
మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: ఎన్ కౌంటర్‌లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడా? లేక తప్పించుకున్నాడా? అన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఇటు పోలీసులు కానీ, అటు మావోయిస్టుల వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మల్కన్‌గిరి, విశాఖపట్నం ఎస్పీలు కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోమవారం ఉదయం రవి మరణించాడనే ప్రచారం సాగింది. దీంతో మల్కన్ గిరి జిల్లాలో కలకలం రేగింది. అయితే కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారని, సురక్షితంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
మరో 4 మృతదేహాలు లభ్యం
ఎన్‌కౌంటర్‌లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. సంఘటన ప్రాంతంలో గాలిస్తున్న కూంబింగ్ దళాలకు మంగళవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉంది. దీంతో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మహిళల సంఖ్య 12కు చేరింది. మావోయిస్టు నేత మురళి మృతదేహాన్ని అతని కుమారుడికి అప్పగించారు. ఇంకా 14 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మృతదేహాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులవిగా పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని, ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన మావోయిస్టులు అడవిలో ప్రాణాలు వదిలే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అంటున్నారు.
మరో ఎన్‌కౌంటర్!
ఎన్ కౌంటర్ జరిగిన అడవుల్లో ఏపీ డీజీపీ సాంబశివరావు మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం లభించిన నాలుగు మృతదేహాల విషయంలో డీజీపీ కథనం మరోలా ఉంది. సోమవారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోలు మంగళవారం కూడా కాల్పులు జరిపారని, పోలీసులు అప్రమత్తమై ఎదుర్కోవడంతో మరో నలుగురు మావోలు మృతి చెందారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారాన్ని (స్పెషల్ ఎక్స్‌గ్రేషియా) అందజేసింది.
గుర్తించిన మృతుల వివరాలు..
1. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అలియాస్ ప్రసాద్ (ఎస్‌జేసీఎం, ఈస్ట్ విశాఖ, బాకూరు విలేజ్, విశాఖ జిల్లా)
2. శ్యామల కిష్టయ్య అలియాస్ దయ, (ఎస్‌జేసీఎం, కోరాపుట్ /శ్రీకాకుళం డివిజన్ సెక్రటరీ)
3. ఐనాపర్తి దాసు అలియాస్ మధు
(డీజీఎం, టెక్‌టీం, వెస్ట్ గోదావరి)
4. గెమ్మెలి కేశవరావు అలియాస్ బిస్రు (డీసీఎస్, ఫస్ట్ సీఆర్‌టీ, తాడపాలెం, విశాఖ జిల్లా)
5. లత అలియాస్ పద్మ, (డీసీఎం, వైఫ్ ఆఫ్ మహేందర్, ఎస్‌జెడ్‌సీఎం, హైదరాబాద్)
6. రాజేష్ అలియాస్ సీమల్ (డీసీఎం, ఫస్ట్ సీఆర్‌సీ, సీజీ)
7. బొట్టు తుంగనాలు అలియాస్ మమత (డీజీఎం, వైఫ్ ఆఫ్ సురేష్, ఎస్‌జెడ్‌సీఎం ఆఫ్ శ్రీకాకుళం జిల్లా)
8. ఎమలపల్లి సింహాచలం అలియాస్ మురళి, అలియాస్ హరి (డీసీఎం, విజయనగరం)
9. స్వరూప అలియాస్ రిక్కి, (డీసీఎం, ఎక్స్ ఆర్టీసీ కండక్టర్, తూర్పు గోదావరి జిల్లా)
10. శ్వేత, ఏసీఎం, పెదబయలు ఏరియా
11. బుద్రి, ఏసీఎం, ఆర్‌కే సెక్యూరిటీ గార్డ్
12. మున్నా, ఆర్‌కే కుమారుడు,
13. రైనో, డీసీఎం
14. కిల్లో సీత, సప్లై టీం మెంబర్, చింతపల్లి డివిజన్, విశాఖపట్నం జిల్లా