ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌రెడ్డిపై ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు వ్యవహారంలో ఎట్టకేలకు దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది.
సుప్రీంకోర్టుకు సీల్డ్‌కవర్‌లో నివేదిక సమర్పించిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్‌రెడ్డిపై ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు వ్యవహారంలో ఎట్టకేలకు దర్యాప్తు పూర్తిచేసిన సీబీఐ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. రెండున్నరేళ్లు అయినా దర్యాప్తు పూర్తిచేయకుండా నిందితులను ఎంతకాలం జైల్లో ఉంచుతారంటూ సుప్రీం కోర్టు జనవరి 27న ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో దర్యాప్తును పూర్తిచేసిన సీబీఐ సంబంధిత నివేదికను జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ. బాబ్డేలతో కూడిన సుప్రీం ధర్మాసనానికి సీల్డ్ కవర్‌లో సమర్పించింది. ఈ కేసులో గాలి జనార్దనరెడ్డి పెట్టుకున్న బెయిలు పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది.
సీబీఐ న్యాయవాది పరస్ కుహద్ ‘దర్యాప్తు నివేదికను తమకు సమర్పించడమైంది’ అని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై జస్టిస్ హెచ్.ఎల్. దత్తు స్పందిస్తూ.. ‘ఆ నివేదికను చదవాల్సి ఉంది.. విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నాం..’ అని ప్రకటించారు. అయితే ఏప్రిల్ 14 సెలవు దినమని సీబీఐ తరపు న్యాయవాది చెప్పగా ‘ఏప్రిల్ 15కు వాయిదావేస్తున్నాం..’ అని పేర్కొన్నారు. సీబీఐ నివేదిక ప్రతిని పిటిషనర్‌కు కూడా ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరగా.. న్యాయస్థానం సమ్మతించలేదు.