గాలి జనార్దనరెడ్డి విడుదల
ఓఎంసీ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దనరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. చిట్ట చివరి కేసులో కూడా ఆయనకు మంగళవారం సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైంది. అనంతరం కొన్ని అధికారిక లాంఛనాలు ముగించి, పరప్పన అగ్రహార జైలు నుంచి శుక్రవారం సాయంత్రం గాలి జనార్దనరెడ్డిని విడుదల చేశారు. జైలు నుంచి తన కాన్వాయ్ లో జనార్దనరెడ్డి చిరునవ్వుతో చేతులు ఊపుతూ వెళ్లారు.
అక్రమ మైనింగ్ ఆరోపణలపై 2011 సెప్టెంబర్ 5న సీబీఐ వర్గాలు ఆయనను బళ్లారిలోని ఆయన ఇంట్లోనే అరెస్టు చేశాయి. శుక్రవారం విడుదల కావడంతో ఆయన మొత్తం 1,237 రోజులు వివిధ జైళ్లలో గడిపినట్లు అయ్యింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన ఆయన.. హైదరాబాద్లోని చంచల్గూడ జైల్లోనే చాలా కాలం ఉన్నారు. మధ్యలో ఆయన బెంగళూరులోని పరప్పణ అగ్రహారంలో గల ప్రధాన జైలుకు కూడా వెళ్లి వచ్చేవారు.
ఎట్టకేలకు ఆయనకు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దాంతో ఆయనను బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తన సోదరునికి బెయిల్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని కేఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.