దేశాన్ని అమ్మేస్తున్నారు | Ganapati Interview | Sakshi
Sakshi News home page

దేశాన్ని అమ్మేస్తున్నారు

Published Sun, Mar 15 2015 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Ganapati Interview

(గణపతి ఇంటర్వ్యూ పూర్తిపాఠం...)

  • మోదీ సర్కారుపై మావోయిస్టు దళపతి గణపతి ధ్వజం
  • ఎన్‌డీఏ సర్కారు హిందూ ఫాసిస్టు ఎజెండాను ముందుకు తీసుకుపోతోంది
  • గత దశాబ్ద కాలంలో మావోయిస్టు పార్టీ గణనీయమైన విజయాలు సాధించింది
  • ప్రపంచంలోనూ, దేశంలోనూ విప్లవ పురోగమనఅనుకూల పరిస్థితులు పెరుగుతున్నాయి
  • మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి దశాబ్దమైన సందర్భంగా గణపతి ఇంటర్వ్యూ

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విదేశీ, భారతదేశ బడా బూర్జువా బడా భూస్వాముల అవసరాలకు అనుగుణంగా సామ్రాజ్యవాద అనుకూల, దేశాన్ని విక్రయించే విధానాలను ప్రమాదకర వేగంతో అమలు చేస్తోందని.. దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారని.. అదే సమయంలో వివిధ రూపాల్లో హిందూ ఫాసిస్టు ఎజెండాను ముందుకు తీసుకుపోతోందని.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్రనేత గణపతి ధ్వజమెత్తారు. ఇది ఇప్పటికే యాతనలు పడుతున్న శ్రామికులు, రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువత వంటి వర్గాల ప్రజల కష్టాలను మరింత దుర్భరం చేస్తోందన్నారు. దేశంలోని వామపక్ష విప్లవ పార్టీలు విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందన్న వాదనలు.. దోపిడీదారులూ, ప్రగతి నిరోధక శక్తులూ చేస్తున్న దుష్ర్పచారమని తోసిపుచ్చారు. భారతదేశంలో మావోయిస్టు పార్టీ గత దశాబ్ద కాలంలో పలు విజయాలు సాధించినప్పటికీ.. ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని.. గ్రామీణ మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమం బలహీనపడిందని గణపతి ఈ ఇంటర్వ్యూలో అంగీకరించారు. మోదీ సర్కారు అభివృద్ధి నిరోధక విధానాలను, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై చేస్తున్న యుద్ధాన్ని తిప్పికొట్టడానికి.. మొత్తం ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, దేశభక్తి శక్తులన్నీ ప్రజల పక్షాన నిలవాలని.. పార్లమెంటరీ ‘వామపక్షాలు’ కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. గణపతి ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివీ...
 
ప్రశ్న: మావోయిస్టు పార్టీ ఈ పదేళ్లలో సాధించిన ప్రత్యేక విజయాలు ఏవి?
గణపతి:  మన దేశ విప్లవోద్యమ చరిత్రలో గత దశాబ్దకాలం సాటిలేనిది. భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఏకైక మార్గదర్శక కేంద్రంగా ముందు నడవడంలో.. ఈ విప్లవానికి మూడు మంత్రదండాలైన పార్టీ, సైన్యం, ఐక్య సంఘటనలు ముందుకన్నా మరింత బలోపేతం కావడంలో.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి వాస్తవమైన ప్రజా స్వభావాన్నివ్వడంలో.. సామ్రాజ్యవాదం, భూస్వామ్యం, నిరంకుశ పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను నిర్మించడంలో.. ‘జల్, జంగల్, జమీన్, ఇజ్జత్, అధికార్’ వంటి సమస్యలపై విశాల ప్రజా సమూహాలను, రైతాంగాన్ని సమీకరించడంలో విలువైన అనుభవాలను గడించడం జరిగింది.
 
ప్రశ్న: ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి? వాటిని అధిగమించేందుకు గల అవకాశాలేమిటి?
గణపతి: కొత్త పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచీ గ్రామ స్థాయి నుంచి కేంద్ర కమిటీ వరకూ అనేక మంది నాయకత్వాన్ని కోల్పోయాము. శత్రు దాడుల నుంచి పార్టీ వ్యూహాత్మక నాయకత్వాన్ని కాపాడుకోవటం ప్రధాన కర్తవ్యాల్లో మొదటిది. గ్రామీణ మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో విప్లవోద్యమం బలహీనపడింది. ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసి, విస్తరించడం ఒక సవాలు. అయితే.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక విదేశీ, భారతదేశ బడా బూర్జువాజీ, బడా భూస్వాముల అవసరాలకు అనుగుణంగా సామ్రాజ్యవాద అనుకూల, దేశాన్ని విక్రయించే విధానాలను ప్రమాదకర వేగంతో అమలు చేస్తుండటం, హిందూ ఫాసిస్టు అజెండాను వివిధ రూపాల్లో ముందుకు తీసుకుపోతుండటం వల్ల.. ప్రజాస్వామిక, పురోగామి, లౌకిక, దేశభక్త శక్తులన్నీ పోరాటంలో ఏకమయ్యేందుకు కొత్త దారులు తెరుచుకుంటాయి. విప్లవ పురోగమనానికి అనుకూలంగా పెరిగిపోతున్న ఈ పరిస్థితులను వినియోగించుకుని గడ్డు పరిస్థితిని అధిగమించగలం. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలం.
 
ప్రశ్న: పార్టీల విలీనం తర్వాత పీఎల్‌జీఏలోనూ, గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంలోనూ విస్తరించడంలోనూ పరిణామాత్మక మార్పు ఉండగా.. ఇప్పుడు మందకొడితనం కనిపిస్తోంది. దీనిని మళ్లీ వేగవంతం చేయడానికి, పురోగమింపచేయడానికి పార్టీ ఏం చేయబోతోంది?
గణపతి: గత దశాబ్ద కాలంలో కొన్ని అద్భుత విజయాలను గెలుచుకున్నాం. అయితే.. 2011 నుంచీ మందకొడితనం కనిపిస్తోంది. విప్లవ ప్రతీఘాతక యుద్ధాన్ని తిప్పికొట్టడంలో.. విప్లవ శక్తులకు - విప్లవ ప్రతీఘాతక శక్తుల బలాలకు ఉన్న తేడా చాలా పెద్దది. ఈ ఎదురెదురు బలగాల బలాలలో ఉన్న తేడా వలన పార్టీ గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడానికి అననుకూల పరిస్థితులు తలెత్తాయి. ఇది పార్టీ స్వీయ బలహీనతల దుష్ఫలితమే. ఉద్యమంలో ఆటుపోట్లు ఒక కొత్త పరిస్థితి ఏర్పడేందుకు దారితీస్తాయి. దీనిని అర్థం చేసుకొని.. పార్టీని, పీఎల్‌జీఏని, ప్రజానీకాన్ని సిద్ధం చేయడంలో పార్టీ నుంచి కొన్ని తీవ్రమైన తప్పులు జరిగాయి. కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో పార్టీకున్న లోపాల వల్ల నష్టాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు.. తప్పులనూ, బలహీనతలనూ గుర్తించి, పార్టీ, పీఎల్‌జీఏ ప్రజా ఉద్యమాల బోల్షెవీకరణకు పూనుకుంది.
 
ప్రశ్న: పార్టీ ప్రధాన కార్యకలాపాలన్నీ ఆదివాసీ ప్రాంతాలకే పరిమితమైపోవటం.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా అటువంటి ప్రాంతాలకే తప్ప మొత్తంగా దేశానికి వర్తించదని కొందరు వాదిస్తున్నారు. దీనికి మీ స్పందన ఏమిటి? ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఎలా విస్తరిస్తారు?
గణపతి: భారతదేశం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమాన అభివృద్ధి కలిగిన విశాలమైన అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశం. ఈ అభివృద్ధిలోని అసమానతే దేశవ్యాప్తంగా ఏక కాలంలో విప్లవాన్ని లేదా సాయుధ తిరుగుబాటును చేసే అవకాశం లేకుండా చేస్తోంది. పెపైచ్చు పాలక వర్గాల చేతిలో శక్తివంతమైన కేంద్రీకృత రాజ్యంతో పాటు సుశిక్షితమైన, ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన సైన్యంతో.. బలమైన అణచివేత యంత్రాంగం ఉంది. అందుచేత.. శత్రువు పరిపాలన అమిత బలహీనంగా ఉండే గ్రామీణ ప్రాంతం నుంచి విప్లవ యుద్ధాన్ని సాగించాల్సి ఉంటుంది. గత దశాబ్ద కాలంగా దండకారణ్యం, బీహార్ - జార్ఖండ్ గెరిల్లా జోన్‌లను గుండెకాయగా చేసుకొని ఉద్యమం ముందడుగు వేసింది. (విప్లవ పార్టీల) విలీనం జరిగిన గత దశాబ్ద కాలంలో గడించిన నూతన అనుభవాలు.. పార్టీ వెనుకంజ వేసిన ప్రాంతాల్లో తిరిగి ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టడానికి, బలహీనమైన ప్రాంతాల్లో తిరిగి బలం పుంజుకోవడానికి, అసలు పార్టీ ఉనికే లేని ప్రాంతాలకు విస్తరించడానికి సహాయపడతాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పీడిత ప్రజానీకంపై సానుకూల ప్రభావం చూపిన.. కళింగనగర్, సింగూర్, నందిగ్రామ్, లాల్‌గఢ్, నారాయణపట్న, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వంటి ప్రజా తిరుగుబాట్ల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి.
 
ప్రశ్న: దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందని కొందరు అంటున్నారు. చావెజ్ 21వ శతాబ్దపు సోషలిజం గురించి కొందరు ప్రచారం చేస్తున్నారు. నేపాల్ మావోయిస్టు పార్టీ ప్రజాయుద్ధ పంథాని వదిలివేసి పార్లమెంటరీ బాట పట్టిందంటున్నారు. ఈ వాదనలకు పార్టీ జవాబేమిటి?
గణపతి: దీర్ఘ కాలిక ప్రజాయుద్ధ పంథాకు కాలం చెల్లిందని ఎలా చెప్పగలరు? మావో మరణం తర్వాత, ప్రపంచంలోని విప్లవ పోరాటాలన్నీ - అవి నూతన ప్రజాస్వామిక విప్లవాలు గానీ, జాతి విముక్తి పోరాటాలు గానీ - దీర్ఘకాలికమయ్యాయి. ఒక వర్గ రహిత సమాజం వైపు వెళ్లాలనే దృష్టికోణం లేకుండా.. ఉనికిలో ఉన్న శిథిల వ్యవస్థనే సంస్కరించే ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం లేదు. చావెజ్ నమూనా కేవలం సంస్కరణ మాత్రమే.. విప్లవం కాదు. రూపంలో గానీ, వస్తురీత్యా గానీ అది సోషలిజమే కాదు. చావెజ్ శ్రామిక వర్గానికీ, రైతాంగానికీ ప్రయోజనకరంగా ఉండేలా కొన్ని చర్యలు చేపట్టాడు. చమురు, కొన్ని ఇతర పరిశ్రమలను అనేక పరిమితులతో జాతీయం చేసినా.. భూస్వామ్య, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానం రూపుమాసిపోలేదు. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థతో వారు వేరు పడలేదు కూడా. కాబట్టి చావెజ్ పాలనలో ఆ దేశ వ్యవస్థలో వచ్చిన మౌలిక మార్పేమీ లేదు. ఇక.. నేపాల్‌లో పార్లమెంటరీ వ్యవస్థ అర్ధభూస్వామ్య విధానంపై ఆధారపడినదీ, సామ్రాజ్యవాద కాడి కింద నలుగుతున్నదీ. అటువంటి వ్యవస్థలో చేరిన ఎవరైనా విప్లవాన్ని వదిలివేయాల్సిందే. నూతన ప్రజాస్వామిక విప్లవంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించినప్పటికీ.. యునెటైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు)కు చెందిన ప్రచండ - భట్టారాయ్ ఆధునిక రివిజనిస్టు ముఠా ఈ రివిజనిస్టు మార్గాన్నే ఎంచుకుంది. లక్షలాది మంది ప్రజలకూ, వేలాది మంది అమరులకూ వారు నమ్మక ద్రోహం చేశారు. ఎప్పటివరకూ వెనుకబడిన దేశాల అర్థభూస్వామ్య వ్యవస్థ రూపం మారకుండా ఉంటుందో, ఎంతకాలం సామ్రాజ్యవాదం మన దేశం లాంటి దేశాలను తన క్రూరమైన పట్టులో బిగించి ఉంచి వాటిని స్వతంత్రంగా అభివృద్ధి చెందనీయదో.. అంతవరకూ విముక్తి కోసం దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథా తప్ప మరో మార్గమే లేదు.

ప్రశ్న: ‘వస్తుగత ప్రపంచ పరిస్థితి విప్లవానికి మరింత అనువుగా మలుపు తిరుగుతోంది’ అని పార్టీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
గణపతి: వస్తుగత ప్రపంచ పరిస్థితి విప్లవ పురోగమనానికి అద్భుతంగా ఉంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ‘మహామాంద్యం’ నాటి నుండి తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. విచ్చలవిడి లే-ఆఫ్‌లు, ఉద్యోగావకాశాలు కుంచించుకుపోవడం, నిరుద్యోగం, దారిద్య్రం ఒకవైపున.. శ్రామిక ప్రజానీకంపై తీవ్రతరమైన దోపిడీ, అణగారిన దేశాలూ, ప్రజలపై నయా వలసవాద దోపిడీ మరోవైపున కొనసాగుతున్నాయి. సామ్రాజ్యవాదానికీ, దాని స్థానిక తొత్తులకూ వ్యతిరేకంగా విప్లవ, ప్రజాస్వామిక, జాతి విముక్తి పోరాట శక్తులు ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతున్నాయి. అయితే.. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ శక్తులు ఈ పరిస్థితిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయి. ఆయా దేశాల నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని కొనసాగించి ఈ బలహీనతను అధిగమించగలమని చారిత్రక పాఠాలు నేర్పాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రివిజనిస్టు, సంస్కరణవాద శక్తుల అసమర్థత రుజువవుతుండటంతో.. ప్రజలు మావోయిస్టు శక్తులతో కలిసి ముందుకు సాగే అవకాశాలు పెరుగుతున్నాయి. అనేక దేశాలలో మావోయిస్టు పార్టీలు, సంస్థలు బలం పుంజుకుంటున్నాయి. కొన్ని కొత్త పార్టీలు ఆవిర్భావ క్రమంలో ఉన్నాయి. మావోయిస్టు పార్టీల, సంస్థల, శక్తుల మధ్య ఐక్యత కూడా పెరుగుతున్నది.
 
ప్రశ్న: ఎన్‌డీఏ అనుసరిస్తున్న విధానాలను, ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ ఎజెండాను తిప్పికొట్టేందుకు పార్టీ ప్రణాళిక ఏమిటి?
గణపతి: ఉదారవాద, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను యూపీఏ ప్రభుత్వాల కంటే వేగంగా, మరింత దూకుడుగా అమలు చేయాలనే ఉద్దేశంతోనే సామ్రాజ్యవాదులు, దళారీ బడా పెట్టుబడిదారులు, బడా భూస్వాములు.. మోదీ, బీజేపీలను అధికార పీఠంపై కూర్చోబెట్టారు. మోదీ ప్రభుత్వ నయా ఉదారవాద దుర్మార్గ విధానాలు ఇప్పటికే యాతనలు పడుతున్న శ్రామికులు, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువత వంటి వివిధ వర్గాల ప్రజల కష్టాలను మరింత తీవ్రతరం చేస్తాయి. ముస్లిములపైనా హిందూ ఫాసిస్టు దాడులు మరింతగా పెరిగిపోతాయి. భూస్వామ్య, అభివృద్ధి నిరోధక శక్తులు బలం పుంజుకోవడంతో దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అణగారిన జాతులు మరింత పీడనకు గురవుతున్నాయి. ఇటువంటి విషయాలలో పార్టీ జోక్యం చేసుకుని ప్రజలను పోరాటాలలోకి సమీకరించాలి. దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్న మోదీ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బహిర్గతం చేయడానికి, ఎండగట్టటానికి విశాల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. విప్లవ, ప్రజాస్వామిక, లౌకిక, దేశభక్త సంస్థలనూ, శక్తులనూ, వ్యక్తులనూ, ప్రజా సమూహాలనూ ఏకంచేసి బలమైన విశాల పునాదిగల ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా.. దేశవ్యాప్తంగా బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు శక్తులను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చు.
 
ప్రశ్న: మావోయిస్టులను ఇప్పటికీ భారతదేశ అంతర్గత భద్రతకు అతి పెద్ద ముప్పుగా భారత రాజ్యం పరిగణిస్తోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నొక్కి చెప్తున్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ మూడవ దశను ఎదుర్కొనేందుకు పార్టీ ఎలా సిద్ధమవుతోంది?
గణపతి:  2009 మధ్య కాలంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ప్రజలపై యుద్ధాన్ని ప్రారంభించింది. మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దీనినే మరింత దూకుడుగా, మరింత నిర్దాక్షిణ్యంగా కొనసాగిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఆపరేషన్ గ్రీన్‌హంట్ మూడో దశ ప్రారంభమయింది. దీనిద్వారా.. మధ్య, తూర్పు భారతదేశ ప్రాంతాల్లో విప్లవోద్యమానికి దృఢమైన దుర్గాలను నాశనం చేయాలని శత్రువు చూస్తున్నాడు. అయితే.. వారు ఒక్క మావోయిస్టులనే టార్గెట్ చేయడం లేదు. ఈ యుద్ధం మొత్తం అణగారిన ప్రజలకు విస్తరిస్తుంది. యుద్ధ రంగం విస్తారమవుతుంది. బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు సిద్ధాంతం, దేశాన్ని తెగనమ్మే మోడీ ప్రభుత్వ విధానాల మేళవింపైన శ్రతుదాడిపై రాజకీయంగా, మిలటరీ పరంగా ఎదురు దాడి చేయాలి. వీటి ప్రభావానికి గురయ్యే అన్ని వర్గాల వారితో ఏకమై ఈ దాడిని దృఢంగా ఎదుర్కొని ఓడించాల్సి ఉంది. ఈ పోరాటంలో కలిసేందుకు పార్లమెంటరీ ‘వామపక్షాలు’ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement