పాట్నా: జాతీయ రహదారిపై దారి దోపిడిలు, మహిళలను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసే ముఠా గుట్టును పాట్నా పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసినట్లు పాట్నా ఎస్పీ మను మహారాజ్ వెల్లడించారు. దొంగల నుంచి ఐదు తుపాకులు, మందుగుండ సామాగ్రితోపాటు పలు వాహానాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను పోలీసు స్టేషన్కు తరలించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పాట్నా జిల్లాలో ప్రధాన రహదారులపై సంచరిస్తూ... మహిళలు, బాలికలను తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆపై సామూహిక అత్యాచారం చేసేవారని ఎస్పీ వివరించారు. ఇటీవల నవబట్పూర్ ప్రాంతంలో మహిళపై సామూహిక అత్యాచార ఘటనతో ఈ నిందితులకు సంబంధం ఉందని తెలిపారు.
అలాగే పశువులను ఎత్తుకెళ్లడంతోపాటు వాహానాలను దొంగలించేవారని తెలిపారు. రహదారులపై దోపిడి దొంగలు సంచారంపై నిఘా సంస్థలు అందించిన సమాచారం మేరకు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో జరిగిన పలు దొంగతనాలతో వీరికి సంబంధాలున్నాయని ఎస్పీ తెలిపారు.