న్యూఢిల్లీ: సినిమాకు ఏమాత్రం తీసిపోని ప్రేమకథ ఇది. రౌడీకి, మహిళా కానిస్టేబుల్ మధ్య కోర్టు ప్రాంగణంలో చిగురించి ప్రేమ చివరకు పెళ్లితో సుఖాంతమైంది. ఈ ప్రేమ పెళ్లి గ్రేటర్ నోయిడాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 30 ఏళ్ల రాహుల్ థాస్రానా 2014, మే 8న వ్యాపారి మన్మోహన్ గోయల్ హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పటికే అతడిపై డజనుకుపైగా కేసులు ఉన్నాయి. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న పాయల్‌తో రాహుల్‌కు సూరజ్‌పూర్ కోర్టులో పరిచయం ఏర్పడింది. విచారణ కోసం కోర్టుకు వచ్చినప్పుడల్లా వీరిద్దరూ కలుసుకునేవారు. జైలు నుంచి విడుదలైన వెంటనే వీరిద్దరూ పెళ్లిచేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాహుల్ నేరచరిత్ర నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో రహస్య ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. పాయల్ మాత్రమే అప్పుడప్పుడు తన అత్తగారింటికి వచ్చి వెళుతోంది. పెళ్లైన తర్వాత రాహుల్ ఎవరికీ కనబడలేదు. పెళ్లి చేసుకునే నాటికి గౌతమ్‌బుద్ధ పీఎస్‌లో పాయల్ పనిచేస్తోంది. గ్యాంగ్‌స్టర్‌ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తమకు తెలియదని, నిజంగా అలా చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ రణ్‌విజయ్ సింగ్ తెలిపారు.
ఆటో డ్రైవర్‌గా పనిచేసిన రాహుల్ డబ్బు, హోదాతో పాటు పాపులర్ కావాలన్న కోరికతో 2008లో అనిల్ దుజానా గ్యాంగ్‌లో చేరాడు. ‘గోయల్ కేసులో జైలు శిక్ష అనుభవించిన తర్వాత రాహుల్ గ్యాంగ్‌స్టర్‌గా మారిపోయాడు. 2016, మే నెలలో పంచాయతీ ఎన్నికల్లో తన తల్లికి ఓటు వేయకపోతే చంపేస్తానని గ్రామస్తులను బెదిరించడంతో అతడు తమ గమనంలోకి వచ్చాడ’ని రణ్‌విజయ్ సింగ్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో మాబుపురా ప్రాంతంలో నాటకీయ పరిణామాల నేపథ్యంలో అతడు బుల్లెట్ గాయాలకు గురయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment