ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ... | Girl kills herself after cracking JEE mains, did not want to be an engineer | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ...

Published Fri, Apr 29 2016 12:18 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ... - Sakshi

ఇంజనీరింగ్ ఇష్టం లేదంటూ...

ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన తర్వాత కూడా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఓసీలకు 100 మార్కులు కటాఫ్ పెడితే, ఘజియాబాద్‌కు చెందిన కృతి త్రిపాఠి ఏకంగా 144 మార్కులు తెచ్చుకుంది. కాస్త కష్టపడితే ఆమెకు ఐఐటీలో సీటు గ్యారంటీగా వస్తుందని కూడా అందరూ చెప్పారు. కానీ, అసలు ఆమె కల వేరు.. తనకు ఇంజనీరింగ్ చదవడమే ఇష్టం లేదు. అంతరిక్ష శాస్త్రవేత్త కావాలనుకుంది. ఐఐటీలో బీటెక్ చేస్తే అంతరిక్ష శాస్త్రవేత్త కావడం అసాధ్యం.

కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఎలాగైనా ఆమెను బీటెక్ చేయించాలనుకున్నారు. ఇంజినీరింగ్‌ చదవక తప్పదనే ఒత్తిడితో 17 ఏళ్ల కృతి త్రిపాఠి బలవన్మరణానికి పాల్పడింది. రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఐదు పేజీల ఆత్మహత్య లేఖ రాసిన కృతి ఐదంతస్తుల భవనం నుంచి దూకి చనిపోయింది. కృతి కుటుంబం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌ నుంచి కోటాకు తరలివచ్చింది. జైపూర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటా కోచింగ్‌ సెంటర్లకు ఫేమస్‌. ఇక్కడే ఆమె కోచింగ్‌ తీసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆమె తండ్రి కోటాలో ఉండగా, తల్లి ఘజియాబాద్‌లో ఉంది. ఉదయం 8.30 గంటల సమయంలో కృతి తండ్రి అన్షుమన్ జిమ్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆయనకు భార్య నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో అమ్మాయి అపార్టుమెంట్ పై నుంచి దూకేసినట్లు పొరుగువాళ్లు చెప్పారని, ఒకసారి వెళ్లి చూడమని ఆమె అన్నారు. వెంటనే అన్షుమన్ అక్కడకు వెళ్లగా.. విగతజీవిగా పడి ఉన్న తన కూతురు కనిపించింది.

అత్యంత కఠినమైన జేఈఈ మెయిన్స్‌లో ఆమెకు 144 మార్కులు వచ్చాయి. అయినా ఇంజినీరింగ్‌ ఇష్టం లేదంటూ కృతి ఆత్మహత్య చేసుకుంది. కోటా నుంచి మొత్తం 35వేలమంది జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులయ్యారు. అయితే, కుటుంబసభ్యుల అంచనాలు, ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement