ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
♦ హోం మంత్రికి మరో వినతిపత్రం అందించిన వైఎస్ జగన్
♦ విభజన హామీలు నెరవేర్చండి.. రెవెన్యూ లోటు భర్తీ చేయండి
♦ కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయండి
♦ పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేయాలని, విభజన చట్టంలోని హామీలను అమలుపరచాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. మంగళవారం ఇక్కడ తన నివాసంలో కలిసిన అనంతరం ఏపీకి సాయంపై ఒక వినతిపత్రాన్ని విడిగా అందజేశారు. ముఖ్యాంశాలు ఇవీ..
► ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కారణంగా నూత న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతున్న ఇబ్బందు లు తమకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మీ జోక్యం కోరుతున్నాం. వాటన్నింటిలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అమలు ప్రజల ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ కూడా బలంగా మద్దతు పలికిం ది. ఆనాడు సభలో ఇచ్చిన హామీలను మరోసారి మీ దృష్టికి తెస్తున్నా.
► ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్లపాటు అమలుచేస్తామని. తద్వారా రాష్ట్ర ఆర్థికస్థితి మెరుగుపడుతుందని నాటి ప్రధాని హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో ఉండే రెవెన్యూ లోటును పూర్తిగా భర్తీచేస్తామని హామీ ఇచ్చారు.
► 2014 మార్చిలో కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్ల పాటు అమలుచేయాలని ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. కానీ ఇంతవరకు అమలుకాలేదు. ఇదే అంశమై నేను గుంటూరులో ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాను. అనేక వినతిపత్రాలు కూడా ఇచ్చాను. ప్రధానమంత్రికి, మీకు, ఆర్థిక మంత్రికి పలు సందర్భాల్లో వినతిపత్రాలు ఇచ్చాను.
► కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈవిషయమై గట్టిగా అడగడం లేదు. పైగా టీడీపీ మంత్రులు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు గాను విభిన్న ప్రకటనలు ఇస్తున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసం చూపలేదన్న వాదన తెస్తున్నాయి. ఈ వాదనలో పసలేదు. ఎందుకంటే కేంద్ర కేబినెట్ నీతి ఆయోగ్ ద్వారా ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు. మా ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశం పరిశీలనలోకి తీసుకోవాలని నీతిఆయోగ్‌కు మార్గదర్శనం చేసింది.
► ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. తద్వారా జీడీపీ వృద్ధిపొందుతుంది. ఒకవేళ ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు ఇస్తే రాష్ట్రంలో భారీగా పారిశ్రామిక పెట్టుబడులు వస్తాయి. తద్వారా రెవెన్యూ వృద్ధి చెందుతుంది. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. అపారమైన నమ్మకంతో యావత్ ఆంధ్రప్రదేశ్ మీ నిర్ణయం కోసం వేచి చూస్తోంది.
► కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, వివిధ విద్యాసంస్థల స్థాపన ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికీ అనేక హామీల పరిష్కారం వెలుగుచూడలేదు. మూడో రైల్వే బడ్జెట్‌లోనైనా విశాఖ రైల్వే జోన్ వస్తుందనుకుని ఆశగా చూస్తే చివరకు నిరాశే ఎదురైంది. ఈ జోన్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ మా పార్టీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. చట్టంలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన జోన్ ఏర్పాటుచేయాలి.
► ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-46(3) ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ రూపంలో ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు కల్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కొద్ది మొత్తాలను మాత్రమే కేటాయించారు. పైగా బీఆర్‌జీఎఫ్ పథకం రద్దు చేశారు.
► ఏపీ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-90 పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది. నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తిచే స్తామని హామీ ఇచ్చింది. 23 నెలలు గడిచినా ఈ విషయంలో చెప్పుకోదగిన పురోగతి లేదు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు జీవరేఖ వంటిది. ప్రణాళిక సంఘం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010 కోట్లుగా ఆమోదించింది. అయితే టీడీపీ ప్రభుత్వం విచక్షణారహితంగా అంచనా వ్యయాన్ని పెంచుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు ఏపీకి ఆసక్తి లేనట్టు కనిపిస్తోంది. కారణాలు వారికే తెలుసు.
► అందువల్ల విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న మీరు ఈ చట్టంలోని హామీల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి.