
ప్రతీకాత్మక చిత్రం
పణజి : భారత్‌లో అత్యధికులు సందర్శించే ప్రాంతంగా.. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయంలో అగ్రగామిగా ఉన్న గోవాకు పర్యాటకమే ప్రాణవాయువన్న సంగతి తెలిసిందే. అందమైన బీచ్‌లు, నైట్‌లైఫ్‌తోపాటు మద్యసేవనానికి కూడా చాలా మంది పర్యాటకులు ఓటేస్తారు. అయితే ఇక నుంచి గోవాలో.. ఎక్కడపడితేఅక్కడ మందు తాగడం కుదరదు. ఎందుకంటే బహిరంగ మద్యసేవనాన్ని నేరంగా పరిగణించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది, ఆ మేరకు రూపొందించిన చట్టాన్ని అతిత్వరలోనే అమలుచేయనుంది.
రెండు కఠిన చట్టాలు : గురువారం పణాజిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించబోతున్నాం. దానికి సంబంధించిన చట్టానికి ఫిబ్రవరి చివర్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదిస్తాం. దీనితోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టాల్లో మార్పులు చేస్తాం. ఈ రెండూ కఠినంగా అమలైతే గోవా పరిశుభ్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు’ అని చెప్పారు.
మందుబాబులకు షాకిచ్చిన కేరళ సర్కార్ : రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యంపై పన్నులు భారీగా పెంచుతూ కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తద్వారా మందుబాబులకు షాకిచ్చింది. రూ.400లోపు విదేశీ మద్యంపై 200 శాతం, బీర్లపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment