
న్యూఢిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల గురించి సమాచారాన్ని ఇకపై గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్‌లో కూడా తెలుసుకోవచ్చు. తాము కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు దగ్గరగా ఉన్న కోవిడ్ పరీక్షా కేంద్రాల గురించి తెలుసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. దీనికోసం గూగుల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), మై గవర్నమెంట్ నుంచి అధికారిక సమాచారాన్ని పొందనుంది. ఈ సమాచారం ఇంగ్లిష్‌తో పాటు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ లభించనుంది.
ఈ సమాచారాన్ని పొందడం చాలా సులభం. గూగుల్‌లో నెటిజన్లు కరోనా గురించిన సమాచారాన్ని వెతికేటపుడు సెర్చ్ రిజల్ట్స్‌లో టెస్టింగ్ అనే బటన్ కూడా కనిపించనుంది. కరోనా వైరస్ నిర్ధారణ జరిపే ల్యాబ్ వివరాలు ఆ బటన్ నొక్కడం ద్వారా పొందవచ్చని గూగుల్ తెలిపింది. ఇదే సదుపాయం గూగుల్ మ్యాప్స్‌లో కరోనా నిర్ధారణ ల్యాబ్‌ల గురించి వెతికే వారికి కనిపించనుంది. ప్రస్తుతానికి 300 నగరాల్లోని 700 పరీక్షా కేంద్రాలను గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, మ్యాప్స్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని కేంద్రాల సమాచారాన్ని పొందుపరచేందుకు అధికారులతో కలసి పని చేస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment