సాక్షి, భోపాల్(ఖండ్వా) : ఒకప్పుడు పెళ్లిళ్లు కట్నకానుకల విషయంలో తగాదాలు వచ్చి ఆగిపోతుండేవి. ఇప్పుడు వాటికి భిన్నంగా అనవసర విషయాల కారణంగానే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లి కొడుకు స్నేక్ డ్యాన్స్ చేస్తున్నాడన్న కారణంగా ఒకరు, వరుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చారని మరోకరు.. ఇలా చాలా రకాలుగా వధువులు పెళ్లిళ్లు ఆపాలని చూస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. ఏకంగా వరుడికి గడ్డం ఉందని అది గీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని పెళ్లి మండపంలో వధువు మొండికేసి కూర్చుంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోగల అయ్‌గటీ గ్రామంలో రూపాలీ, మంగల్‌సింగ్‌ల వివాహానికి పెద్దలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి మండపం వద్దకు వరుడు బంధువులతో ఊరేగింపుగా వచ్చాడు. ఆ సమయంలో వరుడిని గమనించిన వధువు.. అతని గడ్డం ఉందని అది తీసేసి వస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చుంది. దీంతో వధువు తరుపు బంధువులు వరుడికి గడ్డం గీయించుకొని రమ్మని చెప్పారు. ఇందుకు వరుడు నిరాకరించాడు. వరుడు గడ్డం గీసుకుని రావాలని చెప్పడం వరుడి బంధువులకూ నచ్చలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో పెళ్లికి వచ్చిన వారు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. పోలీసులు మండపానికి చేరుకుని నచ్చజెప్పడంతో వరుడు షేవింగ్ చేసుకునేందుకు అంగీకరించాడు. అప్పటికే ముహుర్త సమయం దాటిపోయింది. దీంతో మరుసటి రోజు ఉదయన్నే మరో ముహూర్తానికి వివాహం జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment