'చేతులు జోడించి కోరుతున్నా.. వేడుకకు రాండి'
Published Fri, Jun 30 2017 2:01 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ : దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీని కేంద్రప్రభుత్వం నేటి అర్థరాత్రి అట్టహాసంగా లాంచ్ చేయబోతుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా లాంచ్ కాబోతున్న ఈ వేడుకకు, ప్రతిపక్షాలన్నీ దాదాపు బాయ్ కాట్ చేస్తున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సీపీఐలు మాత్రం గైర్హాజరు కాబోతున్నట్టు ప్రకటించాయి. అయితే నేడు అర్థరాత్రి నిర్వహిస్తున్న జీఎస్టీ వేడుకకు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరుకావాలని సమాచార, ప్రసారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ వేడుకను బాయ్ కాట్ చేయడం సరియైనది కాదని నాయుడు పేర్కొన్నారు. ''మరోసారి రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని. అందరం కలిసి ఈ వేడుకలో పాల్గొంద్దాం. ఇది కేవలం వేడుక మాత్రమే కాదు. పన్ను విధానంలో ఓ చారిత్రాత్మకమైన సంస్కరణ'' అని నాయుడు చెప్పారు. ఈ వేడుకలో నాన్-ఎన్డీయే పార్టీలు అన్నాడీఎంకే, జేడీయూ, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ లు హజరవుతున్నాయి.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవ్ గౌడలను ఈ జాయింట్ సెషన్లో ప్రసంగించాల్సిందిగా కేంద్రప్రభుత్వం వారికి ఆహ్వానాలు కూడా పంపిందని నాయుడు తెలిపారు. చేతులు జోడించి కోరుతున్నానని, మీరందరూ ఈ వేడుకకు హాజరుకావాలని అభ్యర్థించారు. కన్సల్టేషన్ ప్రక్రియలో భాగస్వాములుగా మనమందరం కలిసి దీన్ని ఆమోదించాని, కానీ హఠాత్తుగా మీరు వేడుకకు హాజరు అవడం లేదని చెప్పడం సరియైనది కాదన్నారు.. మరోసారి మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నానని వెంకయ్యనాయుడు అభ్యర్థించారు. వ్యాపారవర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంత హడావుడిగా జీఎస్‌టీని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందని పేర్కొంటూ కాంగ్రెస్ ఈ వేడుకకు గైర్హాజరవుతోంది. జీఎస్‌టీపై మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా గైర్హాజరు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement