ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలో శుక్రవారం లాహోర్‌లోని విఖ్యాత గడాఫీ స్టేడియంలో ఈద్ ప్రార్థనలు జరిగాయి.
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలో శుక్రవారం లాహోర్‌లోని విఖ్యాత గడాఫీ స్టేడియంలో ఈద్ ప్రార్థనలు జరిగాయి. సయీద్‌తో కలిసి వేలాది మంది రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు నగరంలోని పలు ప్రాంతాలలో సయీద్ ఫొటోతో కూడిన పోస్టర్లు వెలిశాయి. దీనికి కొన్నిగంటల ముందు.. కాశ్మీర్, పాలస్తీనా, బర్మాల్లో అణచివేతకు గురైనవారు స్వేచ్ఛా వాయువుల్లో ఈద్ జరుపుకునే సమయం దగ్గర్లోనే ఉందని ఈ ఉగ్రనేత ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు. ‘ఈ పరీక్షా సమయంలో మేము మీకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. త్వరలో మీ విజయానంతరం ప్రపంచం యావత్తూ మీకు ఈద్ ముబారక్ చెబుతుంది. మీ త్యాగాలు వృథా పోవు. దేవుణ్ని స్తుతిస్తాం. ఇస్లాం బలపడుతుంది.
ఆ సమయం అతి సమీపంలోనే ఉంది.. కాశ్మీర్’ అంటూ (@HafizSaeed JUD) ఉపదేశమిచ్చాడు. జమాద్-ఉద్-దవా ఉగ్రసంస్థ అధినేత అయిన సయీద్ తలపై కోటి డాలర్ల రివార్డు ఉంది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన పేలుళ్లకు కుట్ర పన్నిన సయీద్‌ను కఠినంగా శిక్షించాలని భారత్ అనేకమార్లు పాక్‌కు విజ్ఞప్తి చేసింది. పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక ర్యాలీలనుద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నోసార్లు కన్పించాడు. కానీ ఆ దేశం మాత్రం అతనికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లేవంటూ వెనకేసుకొస్తోంది. ముంబై ఉగ్ర డాడుల్లో ఆరుగురు అమెరికన్లతో పాటు మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు.