
శబ్దకాలుష్యాన్ని ఒక పెనుప్రమాదంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు దీని వల్ల ఎదురయ్యే సమస్యలను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంటూ దీని వల్ల కుంగుబాటు, మానసిక ఒత్తిడి మొదలుకుని షుగర్‌వ్యాధికి, అంతిమంగా గుండెపోటుకు దారితీయవచ్చునని పేర్కొంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ద్వారా ఈ శబ్దాలు ‘సైలెంట్ కిల్లర్’గా మారినట్టు ఐరోపా కమిషన్ సైతం అభిప్రాయపడింది. ఈ శబ్దాలు హైపర్‌టెన్షన్, ఒబెసిటీ, డయాబెటీస్, గుండెపోటు వంటి వాటికి కారణమవుతాయని కమ్యూనిటీ ఆఫ్ హెల్త్, లీగల్ ప్రొఫెషనల్స్ ‘ ది క్వయిట్ కోయలుషన్’ చైర్మన్ డా. డేనియల్ ఫింక్ చెబుతున్నారు..
ఢిల్లీలో అత్యధిక సగటు వినికిడి శక్తి లోపం....
మొత్తంలో ప్రపంచనగరాల్లో చూస్తే మన దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక సగటు వినికిడి (సామర్థ్యం)లోపం రికార్డయింది. ఇది మిగతా నగరాలతో పోల్చితే అత్యంత అధికం. శబ్దకాలుష్యం వల్ల సాథారణ ఢిల్లీ వాసి తనకన్నా 19.34 ఏళ్ల పెద్దవాళ్లు సహజంగా కోల్పోయో వినికిడి ఇప్పుడే కోల్పోతున్నాడు. నగరాల్లో విస్తరిస్తున్న వినికిడి కోల్పోయే ప్రమాదాలపై గతేడాది మిమి హియరింగ్ టెక్నాలజీస్ ‘ప్రపంచ వినికిడి సూచిక’ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా రెండులక్షలకు పైగా వినికిడి పరీక్షలను నిర్వహించింది.
ఈ ఫలితాలతో పాటు డబ్ల్యూహేచ్‌ఓ శబ్దకాలుష్యం డేటా, నార్వే పరిశోధన సంస్థ సింటెఫ్ సమాచారాన్ని బట్టి 50 దేశాల్లో శబ్దకాలుష్యం, వినికిడి లోపాల సమస్యలపై ఈ సూచిక తయారు చేసింది. దీనిలో భాగంగానే ఢిల్లీలో అత్యంత సగటు వినికిడి సామర్థ్యలోపాలున్నట్లు కనుగొనింది. మొత్తంగా శబ్దకాలుష్యపరంగా చూస్తే చైనాకు చెందిన గ్యాంజావో నగరం ప్రధమస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఈజిప్ట్ రాజధాని కైరో, ఫ్రాన్స్ రాజధాని పారిస్, చైనా రాజధాని బీజింగ్,, అయిదోస్థానంలో భారత రాజధాని ఢిల్లీ ఉన్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
పరిష్కారాలు...
రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న ఈ సమస్యను పూర్తిగా అరికట్టలేకపోయినా పరిమితులలో ఉంచేందుకు ట్రాఫిక్ నియంత్రణ వ్యూహాలు, లైట్‌రైల్ వ్యవస్థలు, ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాల ప్రోత్సాహం, వాహనాలకు వేగ నియంత్రణ ఏర్పాట్లు, శబ్దాల నియంత్రణ పద్ధతుల ఏర్పాటు వంటి చర్యలను ప్రారంభించాలని శబ్దకాలుష్యంపై పరిశోధకుడు డా. జాన్ కింగ్ సూచించారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)