కనబడని కొవ్వుతో మరణం!
ఢిల్లీ: మనకు పైకి కనిపించడానికి లావుగా ఉండే వారిలోనే కాకుండా అంతర్గతంగా ఏర్పడేటువంటి కొవ్వుతో చాలా ప్రమాదం పొంచి ఉందనీ, ఒక రకంగా ఇది మరణానికి దగ్గరవుతున్నట్లే అని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదర భాగంలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వలన ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు. చర్మం కింది భాగాలలో అంతర్గతంగా తయారయిన కొవ్వు మూలాన అనేక వ్యాధుల బారిన పడటానికి అవకాశం ఉంటుంది. హృద్రోగులలో ఈ తరహా కొలెస్ట్రాల్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది.
ముఖ్యంగా మనదేశంలోని స్థూలకాయుల్లో హైపర్టెన్షన్, థైరాయిడ్, డయాబెటిస్ తదితర వ్యాధుల బారిన పడిన వారికి ఆ వ్యాధుల మీద అవగాహన లేకపోవడం వలన తప్పకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సైతం తీసుకోలేకపోతున్నారు. ఇది ఎక్కువ నష్టం జరగడానికి దోహదం చేస్తుందని ఒబెసిటీ రంగంలో కృషి చేస్తున్న ఇండియా కంపెనీ వీఎల్సీసీ స్థాపకురాలు వందనా మిశ్రా తెలిపారు.
ప్రతి యేటా నవంబర్ 26 ను యాంటీ ఒబెసిటీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో అస్తవ్యస్తమైన జీవన విధానం, అహారపు అలవాట్ల మూలంగా పెరుగుతున్న స్థూలకాయులు తప్పకుండా తమ బరువును తగ్గించుకోవడం దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.