ఎన్‌ఆర్‌సీ నమోదు కోసం వేచి చూస్తున్న అసోం వాసులు (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : భూమి, భాష, సంస్కృతి ఏ జాతికైనా తన ఉనికిని కాపాడుకునేందుకు ఇవి కీలకం. వీటి కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఒక్కొసారి నరమేథానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మచ్చగా మిగిలిపోయిన అసోంలోని మోరిగావ్ జిల్లాలో గల నెల్లి గ్రామంలో జరిగిన ఘటన ఇందుకు ఓ తార్కాణం. 1983 ఫిబ్రవరి 18న నెల్లి గ్రామంలో నరమేథం చోటు చేసుకుంది. తమ ప్రాంతంలోకి వచ్చి స్థిరపడిన బంగ్లాదేశీయులపై అస్సాం తెగలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఒక్క రాత్రిలో దాదాపు మూడు వేల మందికి పైగా పురుషులు, మహిళలు, పిల్లలు ఈ దాడిలో చనిపోయారు. దీంతో అప్పటివరకూ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులను వెనక్కు పంపాలని శాంతియుతంగా సాగిన ఉద్యమానికి ఒక్కసారిగా రక్తపు మరకలు అంటాయి.
ఈ ఘటన జరిగి 35 ఏళ్లు గడిచినా దాని ఆనవాళ్లు ఇప్పటికీ గగుర్పాటుకు గురి చేస్తూనే ఉంది. అసోంలో దాదాపు 3.29 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్న దేశ పౌరుల నమోదు కార్యక్రమం ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(ఎన్‌ఆర్‌సీ) తుది రిపోర్టు ఈ నెల 30న వెలువడనుంది. 1971 మార్చి 24 కంటే ముందు నుంచి రాష్ట్రంలో నివసిస్తున్నవారిని గుర్తించేందుకు ఎన్‌ఆర్‌సీని తయారు చేస్తున్నారు. ఎన్‌ఆర్‌సీ తొలి రిపోర్టు ఈ ఏడాది జనవరి 1న వెలువడింది.
జాతీయ మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం దాదాపు లక్షల మంది పేర్లను తుది ఎన్‌ఆర్‌సీలో చేర్చలేదని తెలిసింది. వీరిలో అత్యధికులు ముస్లింలని సదరు రిపోర్టుల సారాశం. ఇదే జరిగితే అసోం ఎన్‌ఆర్‌సీ రిపోర్టు దేశంలో ఇతర ప్రాంతాలపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయుల కారణంగా భారత్‌లో మత పరమైన సమస్య తలెత్తొచ్చు. 2017లో మాజీ ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ చైర్మన్‌గా వేసి కమిటీ రిపోర్టు ప్రకారం అస్సాం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15 జిల్లాలు వలసదారులతో నిండిపోయాయని పేర్కొన్నారు.
యూఎన్‌హెచ్‌సీఆర్ ప్రకారం ఒక ప్రాంతానికి చెందని వారికి ఓటు, సొంత ఆస్తి కలిగివుండటం, గుర్తింపు కార్డులు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సర్వీసులు ఉండవు. 1982లో మయన్మార్‌లో పౌరసత్వాన్ని కోల్పోయిన రోహింగ్యా వలసదారులు ఇప్పటికీ ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారో మనకు తెలిసిందే. మరోవైపు అసోం ఎన్‌ఆర్‌సీ రిపోర్టును క్యాష్ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. అయితే, వలసదారుల పట్ల గతంలో దేశ వైఖరిని పరిశీలిస్తే కొంత ఊరట కలుగుతుంది. 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా వలసదారులుగా మిగిలిపోయిన వారిని బంగ్లా, భారత్‌లు పంచుకున్నాయి. 2008లో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు దాదాపు 37 వేల మందికి దేశ పౌరసత్వాన్ని ప్రసాదించగా, 2015 ఆగష్టులో భారత్ 14 వేల మందికి దేశ పౌరసత్వాన్ని ఇచ్చింది.
అసోంలో హై అలర్ట్..
ఎన్‌ఆర్‌సీ రిపోర్టు వెలువడుతున్న నేపథ్యంలో అసోం పోలీసులు వివిధ మతాలు, కులాల మధ్య మనస్పర్ధలు రేకెత్తకుండా ఉండేందుకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోషల్‌మీడియాపై డేగ కన్ను వేశారు. శాంతి, భద్రతలు అదుపుతప్పకుండా చూసేందుకు 220 కంపెనీలకు చెందిన 22 వేల మంది పారామిలటరీ బలగాలను రాష్ట్రవ్యాప్తంగా మోహరించారు.
కాగా, రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీపై భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిపోర్టు పేరు లేనంత మాత్రన వారిని విదేశీయులుగా భావించబోమని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. రిజిస్టర్‌లో అంశాలను ఆధారం చేసుకుని ఎవరినీ విదేశీయుల ట్రైబ్యునల్‌కు పంపొద్దని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment