సాక్షి,చండీగర్: డేరా సచా సౌథాలో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని బుధవారం పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ ఆదాయ పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లను ఆదేశించింది. డేరా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్, ఆయన ప్రధాన అనుచరులపై ఈ ఆరోపణలకు సంబంధించి విచారణ నిర్వహించాలని కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరింది. డేరా సచా సౌథా ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ అవసరమని సీనియర్ అడ్వకేట్ అనుపమ్ గుప్తా వాదనలపై హైకోర్టు బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
డేరా ప్రాంగణాన్ని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గ్రామంగా పేర్కొంటూ హర్యానా ప్రభుత్వం డేరాకు ఇచ్చిన మినహాయింపులపైనా విచారణ నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. డేరాలో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ గతంలో భూపీందర్ హుడా సర్కార్, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం గుర్మీత్ సింగ్‌కు అనుకూలంగా వ్యవహరించాయని కోర్టు దృష్టికి ఫిర్యాదులు అందటంతో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
డేరా బాబాను అత్యాచార కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో నష్టపోయిన బాధితులకు సహాయపడేందుకు కాంపెన్‌సేషన్ ట్రిబ్యునల్స్‌ను నెలకొల్పాలని పంజాబ్, హర్యానాలను హైకోర్టు ఆదేశించింది.