వర్ణ రంజితమైన మధుర | Holi frenzy grips Krishna’s land Mathura | Sakshi
Sakshi News home page

వర్ణ రంజితమైన మధుర

Published Mon, Mar 17 2014 12:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

వర్ణ రంజితమైన మధుర

వర్ణ రంజితమైన మధుర

మధుర : శ్రీకృష్ణలీలకు ప్రసిద్ధి చెందిన మధుర వర్ణరంజితం అయ్యింది. ఇక్కడ హోలీ పండుగను వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు. హోలీ రోజున భంగ్ సేవించడం ఇక్కడి సంప్రదాయం. ఆ పద్ధతిని కొనసాగిస్తూ భంగ్ తయారు చేసిన స్థానికులు తోటివారితో కలిసి ఆ భంగ్ సేవిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. రంగులు చల్లుకుంటూ, పడవలపై డోలక్‌లు వాయిస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇక శ్రీకృష్ణుడి లీలామృతాలకు పెట్టింది పేరైన బృందావనం ఆనంద పరవశంలో మునిగితేలుతోంది. రంగుల లోకంలో విహరిస్తూ తన్మయత్వం పొందుతోంది. రంగుల పండుగ హోలీ సంబరాలు బృందావనంలో అంబరాన్నంటుతున్నాయి. వేలమంది ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హోలీ సంబరాలు వినూత్నంగా సాగుతున్నాయి. చారిత్రక మహంకాళీ దేవాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సాధారణంగా ఆలయ గర్భ గుడిలో రంగులు చల్లడం ఎక్కడా చూసి ఉండరు. కానీ మహంకాళీ ఆలయం మాత్రం ఇందుకు విభిన్నం. ఇక్కడి ఆలయంలో రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గర్భగుడిలో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తూనే రంగులు చల్లుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో చిందులేస్తూ గంతులేస్తున్నారు.

రంగుల లోకం ఆవిష్కృతమవుతోంది. సమస్త భారతవాని సప్త వర్ణ శోభితమవుతోంది. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతున్నారు. రాజస్థాన్ రంగుల్లో మునిగిపోతోంది. చారిత్రక ఉదయ్‌పూర్‌లో వర్ణాలు విరగబూస్తున్నాయి. స్థానికులతో చేరిన విదేశీయులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.

వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు రంగుల లోకంలో విహరిస్తూ తన్మయత్మం పొందుతున్నారు. ఒకే చోట చేరి వందలమంది రంగులు చల్లుకుంటూ.... పాటలు పాడుతూ... నృత్యాలు చేస్తూ సంతోషం పంచుకుంటున్నారు. బాణాసంచా పేలుళ్లు పండుగ సంరంభానికి కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ అంతటా రంగులు విరబూస్తున్నాయి. సిలిగురిలో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. విదేశీయులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు.  వాణిజ్య రాజధాని వర్ణాల్లో మునిగిపోతోంది. యువత రంగల లోకంలో విహరిస్తోంది. బాలబాలికలు, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ గంతులేస్తున్నారు.

ఇక నిత్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రుమూకల దాడిని పసిగట్టడంలో గస్తీ తిరుగుతూ ఉండే సైనికులకు కొన్ని సందర్బాల్లోనే ఆటవిడుపు దొరుకుతుంది. రంగుల పండుగ వస్తే వారి ఆనందానికి అడ్డే ఉండదు. ఈ పండుగ వేళ జవాన్లు కూడా రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. పరస్పరం రంగులు పులుముకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషం పంచుకున్నారు. కాగా హోలీ సంబరాలను వివిధ ప్రాంతాల్లో కొందరు ఆదివారం జరుపుకోగా, మరికొందరు సోమవారం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement