ఎంత జోష్‌గా హోలీ ఆడతామో.. శరీరానికి, దుస్తులకు అంటిన రంగుల్ని వదిలించుకునేందుకు అంతే తంటాలు పడుతుంటాం. ఆర్గానిక్, కెమికల్ రంగులతో పాటు గుడ్లు, బురద, ఆయిల్.. ఇలా హోలీకేళీకి ఏదీ అతీతం కాదు. త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి.
హోలీ ఆడిన తర్వాత రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు..
► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది.
► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు.
► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు)
► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్‌కి బాదం నూనె కలిపి పేస్ట్‌లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి.
► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి.
► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది.
► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు.
► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి.
► ఒకవేళ హెయిర్‌ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకుంటే మంచిది.
మరకలు పొగొట్టుకోండిలా...
హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్‌గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్‌గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు.
► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి.
► అరకప్పు వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి.
► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్‌లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి.
► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్‌లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది.
► వెనిగర్‌లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని ఉపయోగించాలి.
చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆడపిల్లల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. హోలీలో ఆర్గానిక్ రంగుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కెమికల్స్ ఉన్న రంగులు వాడతామో అప్పుడే ఈ ఇబ్బంది. కాబట్టి.. వీలైనంత వరకూ సహజసిద్ధమైన రంగులతో హోలీని సెలబ్రేట్ చేస్కోండి. హ్యాపీ హోలీ..
Comments
Please login to add a commentAdd a comment