సైకిల్ మెకానిక్.. ఐఏఎస్ అయ్యాడు!
సైకిల్ మెకానిక్.. ఐఏఎస్ అయ్యాడు!
Published Mon, Jun 13 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM
చిన్న వయసులోనే తండ్రి తనువు చాలించడంతో తన చదువును ఆపేసిన ఓ బాలుడు... కష్టాలకు ఎదురీదాడు. పూట గడవని స్థితిలో ఫీజులు కట్టలేక ఎన్నోసార్లు విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే విరమించుకున్న ప్రతిసారీ ఏదో ఒకరూపంలో అతడికి ప్రోత్సాహం లభించడంతో పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి చదువును కొనసాగిస్తూ వచ్చాడు. అయితే చిన్నతనంలో డాక్టర్ అయ్యి.. అందరికీ సేవలు అందించాలనుకున్న తన కోర్కెను.. జీవితానుభవాలకు అనుగుణంగా మార్చుకొన్న ఆ బాలుడు.. ప్రజాసేవే లక్ష్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.
మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్.. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలుగనేవాడు. వరుణ్ తండ్రి సైకిల్ రిపేర్ షాపును నడిపిస్తూ.. వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్ తోపాటు అతడి సోదరికి కూడ మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే లక్ష్యంగా పనిచేసేవాడు. కానీ వరుణ్ 2006 సంవత్సరంలో పదోతరగతి పరీక్షలు రాశాడో లేదో తండ్రి ఉన్నట్లుండి గుండెజబ్బుతో మరణించాడు. అప్పటికి సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతోంది. కానీ తండ్రి ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైపోయింది. సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనం ఇల్లుగడవడానికే చాలీ చాలకుండా ఉండేంది. దాంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్.. చదువుకు స్వస్తి చెప్పేసి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని ప్రారంభించిన కొన్నాళ్ళకు పదోతరగతి పరీక్షల్లో పట్టణంలోనే రెండో అత్యధిక మార్కులతో పాసయ్యాడు. తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి ఎంతో సంతోషించడంతోపాటు అతడ్ని పై చదువులకు ప్రోత్సహించారు. దీంతో వ్యాపారాన్ని తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ పరిస్థితుల్లో కాలేజీ ఫీజు పదివేల రూపాయలు కట్టలేక తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. అదే సమయంలో వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ అభీష్టాన్ని తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. జేబునుంచి పదివేల రూపాయలు తీసివ్వడంతో కాలేజీలో చేరిన వరుణ్.. నెలవారీ ఫీజు కట్టేందుకు చదువుతోపాటు రేయింబగళ్ళు ఖాళీసమయాల్లో ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ఫీజులు కట్టేవాడు.
ఇంటర్ పూర్తయిన తర్వాత తాను అనుకున్నట్లుగా ఎంబిబిఎస్ చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఎంఐటీ కాలేజ్ పూనె లో ఇంజనీరింగ్ లో చేరాడు. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాసై... స్కాలర్ షిప్ తెచ్చుకొని ఇంజనీరింగి పూర్తయ్యే లోపే క్యాంపస్ సెలెక్షన్ లో 2012 లో మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఇక జీవితం స్థిరపడిపోయినట్లే అనుకునే సమయంలో అతడి జీవితం మరో మలుపు తిరిగింది. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్ లో స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవే పరమావధిగా భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకొని, మిత్రుల సహాయంతో ఆర్నెల్లపాటు యూపీఎస్ సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. అందుకు పుస్తకాలు కొనడానికి కూడ ఎంతో ఇబ్బందులు పడి, చివరికి ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదివి 2014 యూపీఎస్ సీ పరీక్షల్లో 32వ ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వరుణ్.. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
Advertisement