
ఆత్మ‘హత్య’ ప్రకంపనలు!
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి ప్రకంపనలు సృష్టిస్తోంది.
- ఐఏఎస్ రవి మృతిపై అట్టుడుకుతున్న కర్ణాటక
- ముమ్మాటికీ ఆత్మహత్య కాదంటున్న కుటుంబీకులు
- సీబీఐ విచారణకు డిమాండ్.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం
- కేసు అప్పగించిన మరుసటిరోజే సీఐడీ అధికారిని మార్చిన రాష్ట్రం
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజాయితీ గల అధికారిని పొట్టనబెట్టుకున్నారని ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. రవిది ముమ్మాటికీ ఆత్మహత్య కాదని ఆయన కుటుంబీకులు స్పష్టంచేస్తున్నారు. రవి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని, లేదంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అటు రాష్ట్ర అసెంబ్లీ వరుసగా రెండోరోజు కూడా దద్దరిల్లిపోయింది. రవి మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబట్టాయి. బుధవారం రవి తల్లిదండ్రులు గౌరమ్మ, కరియప్ప, సోదరుడు రమేశ్, సోదరి భారతి, మామ హనుమంతరాయప్ప అసెంబ్లీ ముందు ధర్నాకు దిగారు.
‘మాకు న్యాయం కావాలి. నా కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడికి నేను జన్మనివ్వలేదు. రవి ధైర్యవంతుడు. ఈ దేశం ముద్దుబిడ్డ’ అంటూ తల్లి గౌరమ్మ కన్నీరుమున్నీరయ్యారు. రవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే మూకుమ్మడిగా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రవిది హత్యగా అనుమానిస్తున్నామని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని రమేశ్ అన్నారు. రవి మామ హనుమంతరాయప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎస్‌ఏ నారాయణ స్వామిపై అనుమానం వ్యక్తంచేశారు. ‘ఆ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని ఓ కంపెనీకి అమ్మారు. తర్వాత ప్రభుత్వం దాన్ని వెనక్కు తీసుకుంది. ఈ గొడవ హైకోర్టు వరకు కూడా వెళ్లింది’ అని చెప్పారు.
రెండోరోజూ దద్దరిల్లిన అసెంబ్లీ..
రవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న తమ డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. మంగళవారం రాత్రంతా శాసనసభలోనే ధర్నా చేసిన ప్రతిపక్ష సభ్యులు.. బుధవారం సభ మొదలు కాగానే బీజేపీ, జేడీఎస్ వెల్‌లోకి దూసుకెళ్లి దుమారం సృష్టించారు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. ఇది సీబీఐకి ఇవ్వాల్సిన కేసు కాదని సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ బయట విలేకరులతో పేర్కొన్నారు.
అనంతరం ఆయన రవి కుటుంబీకులను ఓదార్చారు. సీఐడీతో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తానని హామీనిచ్చారు. అయితే కుటుంబీకులు వినకపోవడంతో.. సీబీఐ దర్యాప్తుపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని హామీనిచ్చారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే నారాయణ స్వామి కొట్టిపడేశారు. తనకు ఏ కంపెనీతో సంబంధం లేదని, ఎవరినీ బెదిరించలేదన్నారు. కాగా, రవి మృతి కేసును సీఐడీకి అప్పగించిన మరుసటి రోజే ప్రభుత్వం ఆ విభాగం ఐజీపీ ప్రణబ్ మొహంతిని మార్చేసింది. ఆయనను కర్ణాటక లోకాయుక్త ఐజీపీగా నియమించింది. సీఐడీ ఐజీపీగా సీహెచ్ ప్రతాప్‌రెడ్డిని నియమించింది. ఈ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆన్‌లైన్ పిటిషన్‌పై ఐఏఎస్‌ల సంతకాలు
రవి మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తిష్ట భారత అనే ఎన్జీఓ చేపట్టిన ‘ఆన్‌లైన్ పిటిషన్’పై కర్ణాటకలోని పలువురు ఐఏఎస్‌లు సంతకాలు చేశారు. ఈ సంతకాలను ప్రధాని మోదీకి పంపనున్నారు. పలువురు ఐఏఎస్‌లతోపాటు 13.58 లక్షల మంది పౌరులు సంతకాలు చేసినట్టు సదరు సంస్థ తెలిపింది.
మాఫియాకు హడల్
కలెక్టర్ డీకే రవి.. ఈ పేరు వింటే కోలార్ జిల్లాల్లో ఇసుక, భూమాఫియాలకు హడల్! కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రవి.. కోలార్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో మాఫియా దందాలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడ గొడవ జరిగినా ప్రత్యక్షమై పేదల పక్షం వహించేవారు. ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారిగా గుర్తింపు పొందారు. సెలవు రోజుల్లో.. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే పేద యువకులకు శిక్షణ ఇచ్చేవారు. ఆయన మృతి చెందారని తెలియగానే జిల్లాలో ప్రజలు స్కూళ్లు, కాలేజీలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించడం గమనార్హం.
పెద్ద తలకాయలపై గురి నేపథ్యంలో..
కోలార్ జిల్లా నుంచి బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖకు అడిషనల్ కమిషనర్‌గా వచ్చిన తర్వాతా రవి తన పంథాలోనే సాగారు. పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపించారు. బెంగళూరులో పన్నులు ఎగవేస్తున్న బడా సంస్థలపై గురిపెట్టిన నేపథ్యంలోనే రవి మరణించడం అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని కొందరు పెద్ద డెవలపర్లపై ఉక్కుపాదం మోపేందుకు రవి సిద్ధమయ్యారని ఆర్‌టీఐ కార్యకర్త గణేశ్ కౌండిని తెలిపారు. అక్టోబర్‌లో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చాక రవి పన్నులు ఎగవేసినహౌసింగ్ సొసైటీల నుంచి రూ.400 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ‘గత గురువారం, శుక్రవారం రవితో ఫోన్లో మాట్లాడా. బెంగళూరులో పన్నులు ఎగవేసిన కొందరు బడా డెవలపర్లపై ఆయన దృష్టి సారించారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు అందించేందుకు నేనూ సిద్ధమయ్యా. ఈలోపే ఈ ఘటన చోటుచేసుకుంది’ అని చెప్పారు. దర్యాప్తు మొదలుకాక ముందే రవిది ఆత్మహత్య అని ప్రభుత్వం చెప్పడాన్ని గణేశ్ తప్పుపట్టారు.
సీబీఐ విచారణ కావాలి
రవి మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఎంపీలతో కలసి బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. రవిది ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విలేకరులతో అన్నారు. సీఎంతో మాట్లాడి నివేదిక తెప్పించుకుంటానని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్లు బెంగళూరు ఎంపీ, కేంద్రమంత్రి అనంత్ కుమార్ చెప్పారు.