- నేతాజీ అదృశ్యంపై ఆయన బంధువు
ముంబై: స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 1945లోనే విమాన ప్రమాదంలో మరణించడం నిజమైతే ఆయన కుటుంబంపై నిఘా ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నేతాజీ తమ్ముడి కుమారుడు అర్ధేందు బోస్ ప్రశ్నించారు. ఈ లెక్కన ఆ తర్వాత కూడా నేతాజీ జీవించే ఉన్నారని అర్థమవుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోందని అన్నారు. అర్ధేందు..నేతాజీ తమ్ముడు శైలేశ్ చంద్ర కుమారుడు.
నేతాజీ ప్రతిష్టను మసకబార్చేందుకు నెహ్రూ-గాంధీ కుటుంబం ప్రయత్నించిందని ఆయన సోమవారం ఆరోపించారు. 1947 తర్వాత నేతాజీ పేరుప్రతిష్టలను, జ్ఞాపకాలను తుడిచివేయడానికి యత్నించిందని.. అందువల్లే దేశ చరిత్ర పుస్తకాల్లో ఆయన గురించిగానీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించిగానీ పెద్దగా ఉండకుండా చూసుకున్నారని విమర్శించారు.
తమ కుటుంబంపై నిఘా పెట్టినట్లుగా తన తండ్రి కూడా చెప్పారని ఆయన పేర్కొన్నారు. కాగా జనసంఘ్ నేత దీనదయాళ్ ఉపాధ్యాయ అనుమానాస్పద మృతిపై విచారణ జరపాలని సోమవారం ఎన్డీయే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ డిమాండ్ చేశారు.