గువాహటి (అసోం) : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐఐటీ గువాహటి విద్యార్థులు పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని వారికి పనికి వచ్చేలా తక్కువ ఖర్చుతో ఇంట్యూబేషన్ బాక్స్‌లకు రూపకల్పన చేశారు. ఇంట్యూబేషన్ అంటే ఎండో ట్రాషియల్ ట్యూబ్ అనే ఓ గొట్టాన్ని నోటి ద్వారా వాయునాళం గుండా పంపిస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నసమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఈ బాక్స్‌లను పేషెంట్ తలపై భాగంలో అమర్చుతారు. దీంతో అతడి తుంపరల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ బాక్సులు ఉపయోగపడతాయి. దీని వల్ల పేషెంట్ పక్కనున్నవారికి, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి కరోనా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. ఈ పరికరాన్ని సులభంగా తయారు చేసే వీలుండటమే కాకుండా, వివిధ ప్రాంతాలకు సులువుగా సరఫరా చేసే అవకాశం ఉంది.
ఒక ఇంట్యూబేషన్ బాక్స్ తయారు చేయడానికి దాదాపు 2వేల రూపాయలు ఖర్చుఅవుతుందని అంచనా వేశారు. అంతే కాకుండా ఈ ఇంట్యూబేషన్ బాక్స్‌లను శుభ్రపరిచి తిరిగి వాడుకోవొచ్చు. ఇంట్యూబేషన్ బాక్స్‌ల తయారీకి ఐఐటీ గువాహటీ విద్యార్థులు విరాళాల కోసం క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించారు. కేవలం 6 గంటల్లోనే రూ. 50 వేలు విరాళంగా సమకూరాయి. వీరు తయారు చేసిన ఇంట్యూబేషన్ బాక్స్‌లను ప్రభుత్వ ఆసుపత్రులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment